కరోనా వార్తలతో భయాందోళనలకు గురవుతున్న భారతీయులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే.. ఆవహించిన వారి అందరి ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ పై ఇండియా విజయం సాధించింది. పక్కనే ఉన్న చైనాలో రోజూ వందల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నా.. ఇప్పటి వరకూ ఇండియాలో మరణం కూడా సంభవించలేదు.

 

అంతే కాదు.. చైనా నుంచి ఇండియాకు వచ్చిన మూడు కరోనా రోగులను కూడా మన భారతీయ వైద్యులు పూర్తిగా ఆరోగ్య వంతులను చేసేశారు. ఫిబ్రవరి నెల మొదట్లో చైనాలోని వుహాన్ నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.

 

వెంటనే కేరళ అధికారులు తక్షణమే తగిన చర్యలు చేపట్టారు. వారిని ఇతరులతో కలవకుండా ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించారు. అంతే కాదు.. కేరళ సీఎం విజయన్ కరోనాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. కేరళలో నమోదైన మొత్తం మూడు కరోనా పాజిటివ్ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చికిత్స అందించారు.

 

ఈ చికిత్స పూర్తిగా విజయవంతమైంది. కరోనా సోకిన మరో ఇద్దరిని ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేశారు. తాజాగా వైరస్ సోకిన మూడో వ్యక్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేరళ మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో విద్యార్థి ఆరోగ్య నివేదికలను పరిశీలించిన అనంతరం ఆస్పత్రి వర్గాలు అతడిని డిశ్చార్జ్ చేసేయాలని నిర్ణయించారు.

 

ఇప్పటికీ కేరళలో 2 వేల 242 మంది వైరస్ అనుమానితులు వైద్య పరిశీలనలో ఉన్నారు. అయినా ఆ మూడు కేసులు తప్ప ఒక్క కేసు కూడా కొత్తగా పాజిటివ్ అని రాలేదు. కేరళతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నా.. ఒక్క పాజిటివ్ కేసు కూడా లేకపోవడం ఇండియన్స్ కు నిజంగా శుభవార్తే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: