జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ డేంజరస్ స్టెప్ వల్ల తొందరలో అంతర్ యుద్ధం తప్పదా ? అన్న అనుమానం పెరిగిపోతోంది.   మార్చి 25వ తేదీన  ఉగాది నాటికి రాష్ట్రంమొత్తం మీద 25 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలన్న ఒకే కారణంతో తొందరలో గొడవలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యేకంగా 29  రాజధాని గ్రామాల్లో ఈ అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రపంచస్ధాయి రాజధాని నిర్మాణం చేస్తానని చంద్రబాబునాయుడు మాయమాటలు చెప్పిన విషయం తెలిసిందే. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 34 వేల ఎకరాలను రైతుల నుండి అప్పట్లో ప్రభుత్వం సమీకరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి  చేసిన మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని గ్రామాల్లో  ఎంత గోల జరుగుతోందో అందరూ చూస్తున్నదే.

 

ఈ ఆందోళనలను ఇలా జరుగుతుండగానే ఇళ్ళపట్టాల పంపిణీ కోసం రాజధాని రైతుల భూములను కూడా ప్రభత్వం పట్టాలుగా మార్చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లోని పేదలకు ఈ భూములను పట్టాలుగా పంపిణీ చేయటానికి రంగం రెడీ అయ్యింది. దాదాపు 4 వేల ఎకరాలను పేదలకు  పట్టాలుగా అందించటానికి అధికారులు రెడీ అయ్యారు. ఈ కారణంగానే ఇపుడు అధికారులతో రైతులు గొడవలు పడుతున్నారు.

 

తమ పొలాలను తమ కళ్ళెదురుగానే ప్రభుత్వం పట్టాలుగా మార్చేసి పేదలకు పంపిణీ చేయటాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారు. దాంతో విధినిర్వహణలో భాగంగా తమ గ్రామాలకు వస్తున్న  ఆర్ఐ,  ఎంఆర్వో, ఆర్డీవో లాంటి అధికారులతో రైతులు గొడవలు పడుతున్నారు. వీళ్ళతోనే గొడవలు పడుతున్న రైతులు పట్టాలు తీసుకున్న పేదలను వదిలిపెడతారా ?  తమకిచ్చిన పట్టాల్లో పేదలు కూడా ప్రశాంతంగా ఇళ్ళు కట్టుకుని ఉండగలరా ? అంటే రైతులకు, పేదలకు మధ్య ప్రతిరోజు  ఘర్షణ తప్పేలా లేదు. మరి ఈ సమస్యను జగన్ ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: