తామ ప్రభుత్వం మిస్టర్ క్లీన్ అని తమ హయాంలో ఎక్కడా కుంభకోణాలు జరగలేదని చాలా ఘనంగా బిజెపి నేతలు చెప్పుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే.  అంతవరకూ ఓకేనా కానీ మరి ఇటువంటి వాళ్ళ అవినీతి సంగతి ఏమిటి ?  వేల కోట్ల రూపాయలను దోచేస్తున్నవాళ్ళని పక్కనే పెట్టుకున్న పార్టీ మిస్టర్ క్లీన్ ఎలాగవుతుంది ? అవును ఇపుడిదంతా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గురించే. 

 

చెన్నైలోని  బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి తీసుకున్న  రూ. 322 కోట్ల అప్పు ఎగ్గొట్టాడు. ఎప్పుడో తీసుకున్న ఆ అప్పు ఇప్పుడు రూ. 401 కోట్లకు చేరుకుంది. వాయిదాలూ కట్టక, అప్పూ తీర్చకపోవటంతో చివరకు అప్పుకోసం గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను వేలం వేయబోతున్నట్లు బ్యాంకు నోటీసులివ్వటం సంచలనంగా మారింది. మార్చి 23వ తేదీన వేలం వేయబోతున్నట్లు బ్యాంకు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టంగా ఉంది.

 

బ్యాంకుల నుండి తీసుకున్న వేలకోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టడంలో సుజనా చౌదరి కి ఘనమైన చరిత్రే ఉంది. గతంలో మారిషస్ బ్యంకు నుండి అప్పు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సుజనా నాంపల్లి కోర్టు చూట్టూ తిరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈయనపై ఇప్పటికే సిబిఐ, ఐటి, ఈడి ఎన్నో కేసులు కూడా పెట్టింది.  ఒకదశలో అరెస్టు తప్పదనే ప్రచారం కూడా జరిగింది. ఇటువంటి వాళ్ళను బిజెపి ఎందుకు భరిస్తోంది ?  కేవలం సుజనా రాజ్యసభ ఎంపి అయిన కారణంగానే నరేంద్రమోడి భరిస్తున్నారా ?

 

మోడి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు రాలేదు నిజమే. కానీ మరి వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసుకుంటున్న ఎంపిల మాటేమిటి ? సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి మోహన్ రావు లాంటి వాళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలున్నాయి. కేవలం రాజ్యసభలో బలం కావాలన్న ఏకైక కారణంతోనే వీళ్ళందరినీ మోడి భరిస్తుంటే ఇక మిస్టర్ క్లీన్ ప్రభుత్వం అని ఎలా చెప్పుకోగలరు ?

మరింత సమాచారం తెలుసుకోండి: