టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. పార్టీలో ఇప్పుడు ఏర్ప‌డిన శూన్య‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. దాదాపు 40 ఏళ్ల‌కు పైగానే ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారు. అన్న‌గారి స‌మ‌యంలో ఆయ‌న‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా ఉన్న గోరంట్ల.. అన్న‌గారి మ‌ర‌ణం త‌ర్వాత బాబు చెంత‌కు చేరుకున్నారు. సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని బుచ్చయ్య 2014లో మంత్రి ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నాలు చేశారు.

 

అయితే, ఈ విష‌యంలో ఆయన ఫెయిల‌య్యారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ హోరెత్తి పోయినా.. బుచ్చ‌య్య చౌద‌రి మాత్రం విజ‌యం సాధించారు. అయితే, ఈ ద‌ఫా అయినా పార్టీ గెలుస్తుంద‌ని, త‌న మ‌న‌సులోని మంత్రి కోరిక నెర‌వేరుతుంద‌ని బుచ్చ‌య్య అనుకున్నారు. కానీ, ఈ ద‌ఫా అసలు పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతైంది. దీనికితోడు గోరంట్ల వ‌యోవృద్ధుకావ‌డంతో ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌లు అంటే 2024లో తాను పోటీ చేసిది లేద‌ని ఎన్నిక‌లు ముగిసిన రెండు నెల‌ల త‌ర్వాత ఆయ‌న వెల్ల‌డించి సంచ‌ల‌నం రేపారు.

 

దీంతో ఇక‌, గోరంట్ల రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నున్నార‌నే క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, కొన్నాళ్ల‌కే ఆయన మ‌న‌సు మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా గోరంట్ల దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల బాణాల‌ను సంధిస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల ఆయ‌న రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు చేస్తున్న ఉద్య‌మానికి భారీ ఎత్తున మ‌ద్ద‌తు ప‌లికారు. రాజ‌మండ్రి నుంచి దాదాపు 100 కార్ల‌తో భారీ ర్యాలీగా రాజ‌ధానికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి గ్రామాల‌ను చేరుకునేందుకు మ‌రో 100 బైకులతో ర్యాలీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో బుల్లెట్‌ను తానే స్వ‌యంగా న‌డుపుతూ.. బుచ్చ‌య్య అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

 

దాదాపు ఈ క్ర‌మంలోనే ఆయ‌న 10 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్టు అనుచ‌రులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బుచ్చ‌య్య 2024 నాటికి లైన్ క్లియ‌ర్ చేసుకున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించే ప‌నిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాను యాక్టివ్‌గా లేకపోతే.. క‌ష్ట‌మ‌ని భావించిన గోరంట్ల 2024లోనూ పోటీ చేసి గెలిచే స‌త్తా త‌న‌కు ఉంద‌ని నిరూపించుకోవ‌డంలో భాగంగానే ఇప్పుడు దూకుడు ప్ర‌ద‌ర్శించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ దూకుడు ఎన్నిరోజులు ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: