ఏపీ బాటలో కర్ణాటక నడుస్తోంది. రాజధాని వికేంద్రీకరణకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుకు  అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కొన్ని కార్యాలయాల తరలింపు ఆలోచన ప్రభావం కర్ణాటకపై కూడా పడింది. ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బీజేపీ అధిష్ఠానం పచ్చ జెండా ఊపడంతో ఈ ప్రక్రియకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

 

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ సర్కారుకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఏపీ బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రస్తుతం సైలెంట్ అయినప్పటికీ మొదట్లో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కర్ణాటక పరిణామాలతో పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని వైసీపీ నేతలు సంతోషిస్తున్నారు. ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, కొన్ని కార్యాలయాలను మారుస్తున్నామని బిజెపి ప్రభుత్వం చెబుది.

 

అమరావతిలో లెజిస్లేటివ్, విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూల్ లో జ్యుడీషియల్ రాజధానుల ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అయితే ఈ ప్రతిపాదనలను విపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో బీజేపీ నిర్ణయం వైసీపీ ఆశలకు జీవం పోసినట్టవుతోంది. యడ్యూరప్పకు బిజెపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పబోదనే అభిప్రాయం బలపడుతోంది. 

 

ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ సమావేశాలను బంగళూరుతోపాటు బెళగావిలోనూ నిర్వహిస్తుంటారు. అదేబాటలో కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించి పరిపాలనను వికేంద్రీకరించబోతున్నారు. దాదాపు  9 ముఖ్యమైన కార్యాలయాలు బెంగళూరు నుంచి తరలిపోనున్నాయి. వీటిలో కృష్ణా భాగ్య జల నిగమ్, కర్ణాటక నీరవారి నిగమ్, పవర్లూమ్ కార్పోరేషన్, షుగర్ డైరెక్టరేట్ అండ్ షుగర్ కేన్ డెవలప్ మెంట్ కమీషనర్, కర్ణాటక మానవ హక్కుల కమిషన్, ఉపలోకాయుక్త కార్యాలయాలు ఉన్నాయి. 

 

1947లో బంగళూరు మైసూరు రాష్ట్రానికి రాజధాని అయింది. 1956లో ఏర్పడిన కర్ణాటక రాష్ట్రానికి రాజధానిగా బంగళూరే కొనసాగింది. ఇప్పటికే మన దేశంలో పలు రాష్ట్రాలు రాజధాని వికేంద్రీకరణను అనుసరిస్తున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల హైకోర్టులు రాష్ట్ర రాజధానుల్లో లేవు. అదేమయంలో రెండు చోట్ల రాష్ట్ర అసెంబ్లీ ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏపీ మరికాస్త ముందుకు అడుగులు వేస్తోంది. రాజధానికి మూడు చోట్ల ఏర్పాటు చేస్తూ వికేంద్రీకరిస్తోంది. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: