దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో ఇళ్లు లేకుండా ఎవరూ ఉండకూడదని పరిస్థితులను మార్చటానికి ప్రయత్నాలు చేశారు. అంతకు ముందు సీనియర్ ఎన్టీయార్ హయాంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. రాష్ట్రంలో రోజురోజుకు జనాభా పెరుగుతూ ఉండటంతో భూముల లభ్యత తగ్గుతోంది. గత ప్రభుత్వాలు సాధ్యం చేయలేకపోయినా సీఎం జగన్ ఉగాది రోజున 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అధికారులు భూములు సేకరించారు. మరికొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూముల లభ్యత తక్కువగా ఉండటంతో అధికారులు ప్రైవేట్ భూములను కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉగాది పండుగ రోజున 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయటం కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకొని ఇళ్లపట్టాలుగా మారుస్తోంది. 
 
సీఎం జగన్ నవరత్నాల్లో భాగంగా ఐదేళ్లలో 25 లక్షల పక్కా గృహాలను కట్టిస్తామని, నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గ్రామాల వారీగా, పట్టణాల వారీగా దొరకని చోట భూములను కొనుగోలు చేస్తూ వైసీపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కానీ కొన్ని మారుమూల ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో సమస్య తలెత్తుతుండటంతో ఉగాదినాటికి 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు సమకూర్చటం సాధ్యమవుతుందా...? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు గడువు తక్కువగా ఉండటంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొన్ని ప్రాంతాలలో భూముల లభ్యత లేదని అధికారులు చేతులెత్తేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పట్టణాలలో ఇళ్ల స్థలాలు కొత్తగా కనుగొనడం దాదాపు అసాధ్యం అని వైసీపీ నేతలే చెబుతున్నారు. స్వర్గీయ ఎన్టీయార్ , దివంగత నేత వైయస్సార్ హయాంలో సాధ్యం కాని హామీ సీఎం జగన్ కు సాధ్యమవుతుందో లేదో చూడాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: