ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నగరాల్లో మెజారిటీ శాతం యువత ఆన్ లైన్ అప్లికేషన్ల సహాయంతో నచ్చిన ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఇష్టమైన ఆహారాన్ని ఇళ్లకు, ఆఫీసులకు తెప్పించుకుంటూ నచ్చిన హోటళ్లలో మెచ్చిన వంటకాల రుచులను ఆస్వాదిస్తున్నారు. కానీ హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రం ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆర్డర్ చేసే ఆహారంలో నాణ్యత పాటించటం లేదు. 
 
రోజురోజుకు నగరాల్లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు పెరుగుతున్నాయి. డెలివరీ సంస్థల సంఖ్య పెరగటంతో వాటి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కంపెనీలు 25 శాతం నుండి 60 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకసారి ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే చాలు డిస్కౌంట్ కూపన్లకు సంబంధించిన సందేశాలు సదరు సంస్థ నుండి మొబైల్ కు వస్తూనే ఉంటాయి. 
 
నగరవాసులు ఫుడ్ అప్లికేషన్ల ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఏ మాత్రం నాణ్యత లేకపోవడంతో వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే వారికి తక్కువ నాణ్యతతో కూడిన ఆహారాన్ని, కుళ్లిపోయిన మాంసంతో వండిన ఆహారాన్ని అందిస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. 
 
అధికారుల విచారణలో హోటళ్ల యాజమాన్యం హోటళ్లకు వచ్చేవారికి ఒక విధమైన ఆహారం, ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే వారికి మరో రకం ఆహారం ఇవ్వాలని సూచించినట్లు తేలింది. కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు ఎక్కడో వండిన ఆహారాన్ని తమ హోటల్, రెస్టారెంట్ ఆహారం అని చెప్పి వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలుస్తోంది. నాణ్యత లేని ఆహారం తిని వినియోగదారులు అనారోగ్యంపాలవుతున్నారు. జీ.హెచ్.ఎం.సీ అధికారులు హైదరాబాద్ నగరంలో ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన పదార్థాలలో నాణ్యత లేకపోతే 040 - 21111111 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: