ఓవైపు భారీగా పెరుగుతున్న ఖర్చులు.. మరోవైపు సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు.. కేంద్రం నుంచి వచ్చే సాయంలోనూ రానురాను కోతలు పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఏపీ బడ్జెట్‌ కసరత్తు ఆర్థిక శాఖకు అత్యంత క్లిష్టతరంగా మారింది.. వివిధ శాఖల నుంచి పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వచ్చినా.. ప్రభుత్వ ప్రాధాన్యతలు.. నవరత్నాల అమలుకే ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేయనుంది ప్రభుత్వం. అయితే ఈ ఏడాది కూడా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సర్కార్‌ ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

 

వచ్చే నెల 15వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. గత బడ్జెట్ కు.. ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు తేడా ఉంటుందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆర్థికపరమైన విషయాల్లో కావొచ్చు.. ఇతరత్రా లోటుపాట్ల విషయంలో కావచ్చు.. ఏమైనా విమర్శలు వస్తే.. వాటిని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలుగా చెప్పి విమర్శలకు ప్రతి విమర్శలు చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కానీ ఇకపై ఈ తరహా వ్యవహరాలకు చెల్లు చీటీ పడినట్టే! ఇకపై పరిపాలన పరంగా.. ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే దానికి పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్‌ను అత్యంత పకడ్బందీగా రూపొందిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తెరిగి కేటాయింపులు చేయడమే కాకుండా.. ఇచ్చిన హామీలు.. మేనిఫెస్టో అమలు విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ దానికి అనుగుణంగానే కసరత్తు చేస్తున్నారు అధికారులు.

 

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వచ్చే ఆదాయంతోపాటు.. కేంద్రం నుంచి రావాల్సిన వాటాలను లెక్కలేసుకుని వాటికి అనుగుణంగా బడ్జెట్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది ఆర్థిక శాఖ. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి.. ఇక్కడి పథకాలకు అన్వయించుకునే అంశం పైనే ఆర్థిక శాఖ ప్రధానంగా ఫోకస్ పెడుతోంది. ఏయే శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయోనని లెక్కలు వేసుకుని.. దానికి అనుగుణంగా బడ్జెట్‌ కసరత్తు చేస్తోంది. 

 

స్థూలంగా రాష్ట్ర ఆదాయం 1 లక్షా 79 వేల కోట్ల రూపాయలుగా ఉంటే.. ఖర్చులు మాత్రం దీనికి మించి ఉన్నాయి. సుమారు రెండు లక్షల 28 వేల కోట్ల రూపాయల మేర ఖర్చులు ఉంటాయనేది అంచనా. గత రెండేళ్ల కాలంలో ఎఫ్.బి.ఆర్.ఎమ్ పరిధి వరకు అప్పులు కూడా తెచ్చుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి రెండు లక్షల 58 వేల 928 వేల కోట్ల రూపాయల మేర అప్పు జమయింది.

 

ఈ క్రమంలో ప్రతి రూపాయి రాక.. పోక ఏ విధంగా ఉంది.. దాన్ని ఏ విధంగా కంట్రోల్‌ చేయాలనే దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది సర్కార్. నెలవారీగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చూస్తే.. సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల ఉంటుందని అంచనా. వీటిల్లో జీతాల నిమిత్తమే సుమారుగా 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇక పెన్షన్లకోసం రెండు వేల కోట్ల రూపాయలు.. సబ్సిడీలు.. రుణాల చెల్లింపు కోసం సుమారు 2500 కోట్ల రూపాయలు ఖర్చుగా కన్పిస్తోంది. ఈ క్రమంలో ప్రతి నెలా సంక్షేమ పథకాలకు.. ఇతర అవసరాల కోసం నిధులను వెతుక్కోవాల్సి వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను సంక్షేమ పథకాలకు మళ్లించాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రిపేర్‌ చేయడమనేది ఆర్థిక శాఖకు తలకు మించిన భారంగా కన్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: