అమరావతి ప్రాంతంలో రాజధాని రైతుల జేఏసీ చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. తమపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్‌ చేపట్టారు రైతులు. 29 గ్రామాల పరిధిలోని విద్య, వ్యాపార సంస్థలన్నీ మూసివేసి నిరసన తెలిపారు.

 

ఏపీ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ఆందోళన చేసినవారిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. దీనికి నిరసనగా రాజధాని ప్రాంతంలో ఈ రోజు  బంద్‌ చేపట్టారు. 29గ్రామాల్లో బంద్‌ కొనసాగింది. 

 

మందండలో మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా బంద్ చేపట్టింది జేఏసీ. జాతీయ స్థాయిలో కూడా దీనిపై చర్చ జరిగింది. జాతీయ మహిళా కమిషన్ వచ్చి మరీ ఎంక్వైరీ చేసి వెళ్లింది. దుగ్గిరాల ఎమ్మార్వోను అడ్డుకున్నందుకు స్థానిక రైతులపై కేసులు పెట్టడంతో.. మందడం మరోసారి చర్చనీయాంశమైంది.

 

మందడంలో రైతులు, మహిళలు రోడ్డు దిగ్బంధించడంతో.. రాజధాని ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. మందడంలో జరుగుతున్న ఆందోళనలను పోలీసులు డ్రోన్లతో చిత్రీకరించడంతో.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారంటూ అభ్యంతరం తెలిపారు.  కానిస్టేబుల్‌పై కొందరు రైతులు చేయి కూడా చేసుకున్నారు. ప్రయివేట్ వ్యక్తుల ద్వారా డ్రోన్ వాడారని... తుళ్ళూరు డీఎస్పీ, సీఐపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

 

మందడం వాసుల ఆరోపణలపై శుక్రవారం పోలీసులు స్పందించారు. డ్రోన్‌లో మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించారనేది అబద్ధమన్నారు తుళ్లూరు డీఎస్పీ. కావాలనే కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు. మందడంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన వారిపై... కేసు నమోదు చేసినట్లు చెప్పారు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి.  

 

మందడం రైతులపై కేసులు పెట్టడాన్ని అమరావతి జేఏసీ తప్పుబట్టింది. బంద్‌ చేపట్టింది. బంద్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: