గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం...వైసీపీ కంచుకోట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా. అపోజిట్ అభ్యర్ధి ఎవరున్న గత నాలుగు పర్యాయాల నుంచి ఇక్కడ పిన్నెల్లిదే విజయం. అసలు ఇక్కడ టీడీపీ ఆవిర్భావించాక, నాలుగుసార్లు మాత్రం విజయం సాధించింది. 1983, 1989, 1994, 1999 ఎన్నికల్లో గెలిచింది. ఇక 2004 నుంచి పిన్నెల్లి ఫ్యామిలీ కంచుకోట అయిపోయింది. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలవగా, 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు.

 

తర్వాత వైఎస్ మరణం, జగన్ కొత్త పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రామకృష్ణా వైసీపీలోకి వచ్చేశారు. అప్పుడే 2012లో జరిగిన ఉపఎన్నికల్లో రామకృష్ణా వైసీపీ నుంచి నిలబడి అద్భుత విజయం సాధించారు. తర్వాత 2014లో రామకృష్ణా విజయాన్ని అడ్డుకోవడం టీడీపీ వల్ల కాలేదు. ఇక 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. రామకృష్ణా మరోసారి అద్భుత విజయం సాధించి మాచర్లని వైసీపీ కంచుకోటగా మార్చేశారు.

 

అయితే ఆయన ఇన్నిసార్లు వరుసగా గెలవడానికి కారణం, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటమే. నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంటే పిన్నెల్లి అక్కడ ఉంటారు. పేద, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందర్నీ కలుపుకుని పోతారు. ఆప్యాయంగా పలకరిస్తారు. పైగా ఇప్పుడు అధికారంలో ఉండటం వల్ల, ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందిస్తున్నారు. 9 నెలల్లో సాధ్యమైన అభివృద్ధి కార్యక్రమాలే చేశారు. అటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో ముందున్నారు.

 

ఇక ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడంతో, ఆ పార్టీ కేడర్‌ పిన్నెల్లి సమక్షంలో వైసీపీలోకి వచ్చేస్తున్నారు. మంచి మాస్ ఫాలోయింగ్‌ ఉన్న పిన్నెల్లి , ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు చెక్ పెట్టడంలో దూకుడుగానే ఉన్నారు. అటు అమరావతి కూడా మాచర్లకు దూరంగా ఉండటం వల్ల పిన్నెల్లికి కలిగే ఇబ్బంది ఏమి లేదు. ప్రస్తుతానికైతే మాచర్లలో పిన్నెల్లికి తిరుగులేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: