కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఒక యువకుడు రాత్రంతా లేడీస్ హాస్టల్ లో ఉండటం, ఆరుగురు విద్యార్థినులు యువకుడికి సహకరించడం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో కలకలం రేపుతోంది. ఈరోజు మధ్యాహ్నం కాలేజీ అధ్యాపకులు, సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రాథమిక విచారణ అనంతరం ఆరుగురు విద్యార్థినులను సస్పెండ్ చేసినట్టు సమాచారం అందుతోంది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గత రెండు రోజులుగా ఫెస్ట్ జరుగుతోంది. ఫెస్ట్ జరుగుతున్న సమయంలో ఆరుగురు విద్యార్థినులు ఒక యువకుడికి హాస్టల్ లోకి రావడానికి సహకరించారు. లేడీస్ హాస్టల్ ఊచలను విరగ్గొట్టి యువకుడు హాస్టల్ లోకి ప్రవేశించాడు. ఒక రోజు మొత్తం హాస్టల్ గదిలోనే ఉన్నాడు. లేడీస్ హాస్టల్ లో యువకుడు ఉన్న విషయం కొంతమంది విద్యార్థినుల ద్వారా మేనేజ్‌మెంట్ కు తెలిసింది. 
 
మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందికి యువకుడు దూరినట్లుగా అనుమానిస్తున్న గది తాళం పగులగొట్టమని ఆదేశాలు జారీ చేసింది. సెక్యురిటీ సిబ్బంది తాళం పగులగొట్టగా మంచం కింద యువకుడు ఉన్నట్టు గుర్తించారు. పట్టుబడిన యువకుడు ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నాడని సమాచారం. ఇప్పటికే పలు వివాదాలతో ట్రిపుల్ ఐటీలు వార్తల్లో నిలుస్తుండగా తాజాగా మరో వివాదంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ వార్తల్లోకెక్కింది. 
 
మేనేజ్‌మెంట్ యువకుడి మీద ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. తాజా ఘటనతో ట్రిపుల్ ఐటీలలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఈ ఘటనతో ట్రిపుల్ ఐటీలలో సెక్యూరిటీ నిఘా ఎలా ఉందనే విషయం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణ తరువాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: