కరోనా వైరస్ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ ధరలపై పడింది. రోజురోజుకు కరోనా వైరస్ గురించి వదంతులు పెరిగిపోతూ ఉండటంతో బ్రాయిలర్ కోడి మాసం ధర భారీగా తగ్గుతోంది. గత 15రోజుల నుండి భారీగా తగ్గుతున్న చికెన్ ధర నిన్న మరింతగా తగ్గింది. చైనా దేశంలో వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ప్రభావం ఇతర రంగాలతో పోలిస్తే కోళ్ల రంగంపై తీవ్రంగా పడింది.  మార్కెట్ లో స్కిన్ లెస్ కిలో 100 రూపాయలు, విత్ స్కిన్ కిలో 90 రూపాయలు, కిలో లైవ్ ధర 60 రూపాయలు పలుకుతోంది. 
 
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చికెన్ తింటే కరోనా సోకుతుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఈ వదంతులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ వదంతులను నమ్మి చికెన్ కొనేవారు తినేవారు కరువయ్యారు. చికెన్ ను ఆర్డర్ చేసే వారి సంఖ్య తగ్గటంతో హోటళ్లు, రెస్టారెంట్లు కూడా తక్కువ మొత్తం చికెన్ ను కొనుగోలు చేస్తున్నాయి. 
 
మార్కెట్ వర్గాలు గతంతో పోలిస్తే 50 శాతం వ్యాపారం తగ్గిందని చెబుతున్నాయి. దక్షణాది రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గుతూ ఉండటంతో కోళ్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల మొదటివారంలో 160 రూపాయలు పలికిన కిలో చికెన్ ఇప్పుడు 100 రూపాయలు పలుకుతోంది. గతంలో ఎప్పుడూ ఇంత తీవ్రంగా నష్టాలు రాలేదని 15 రోజుల నుండి రోజురోజుకు చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఇలా జరగటం ఇదే తొలిసారని వ్యాపారులు చెబుతున్నారు. 
 
వైద్యులు చికెన్ తింటే కరోనా రాదని చెబుతున్నా వినియోగదారులు మాత్రం చికెన్ కు దూరంగానే ఉంటున్నారు. కోళ్ల రైతులు చికెన్ ధరలు పడిపోవడం వలన తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి వస్తే తప్ప చికెన్ ధరలు పెరగవని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కిలో స్కిన్ లెస్ 100 రూపాయలకు రిటైల్ వ్యాపారులు విక్రయిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: