రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..రాజకీయ విశ్లేషుకుని అవతారమెత్తిన విషయం తెలిసిందే. అవసరమైన సందర్భాల్లో మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది. అమలు చేసే నిర్ణయాల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలనే దానిపై సలహాలు ఇస్తుంటారు. విమర్శలు కూడా చేస్తుంటారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, సలహాలు ఇచ్చారు.

 

ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి కూడా అదే మాదిరిగా సలహాలు ఇస్తూ, విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే? ఉండవల్లి చెప్పే వాటిల్లో చాలా వరకు వాస్తవాలు ఉంటున్నాయి. అయితే వాటిని పట్టించుకుని తప్పులుంటే సరిచేసుకుంటే మంచే జరుగుతుంది. తాజాగా కూడా ఉండవల్లి ఓ విషయంలో జగన్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇటీవల కాలంలో ఏపీలో రేషన్, పెన్షన్‌ల్లో కొత్త కార్డులు పంపిణీ చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.

 

కొత్త కార్డులు పంపిణీ చేయడంలో భాగంగా అర్హులు, అనర్హులని ప్రకటిస్తున్నారు. అంటే ఇదివరకు రేషన్, పెన్షన్ వచ్చినవాళ్ళలో కొంతమందికి ఇప్పుడు కట్ అయిపోయాయి. అలాగే కొత్తవారు కూడా వచ్చి చేరారు. ఇక్కడవరకు అంతా బాగానే ఉన్న, పెన్షన్, రేషన్ కార్డులు పోయినవారు ఓ రేంజ్‌లో గగ్గోలు పెట్టేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే తమ పెన్షన్, రేషన్ కార్డులని తొలగిస్తున్నారని వాపోతున్నారు. వాస్తవానికి అనర్హులతో పాటు, అర్హులకు కూడా పెన్షన్, రేషన్ పోయాయి. దీంతో జగన్‌కు ఉండవల్లి ఓ సలహా ఇచ్చారు.

 

పెన్షన్, రేషన్ కట్ అయిన వారు ఎందుకు అనర్హులు క్లియర్‌గా చెప్పి తీయాలని, అలాగే అర్హులకు కట్ అయితే వాటిని సరి చేయాలని చెప్పారు. ఇందులో జగన్ అర్హులకు పోతే వాటిని రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనర్హులు ఎందుకు అనర్హులో చెప్పడం లేదు. దీంతో వారు మా పెన్షన్, రేషన్ జగన్ తీసేశాడని రచ్చ చేసేస్తున్నారు. దీని వల్ల జగన్‌కు నష్టం జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం ఎక్కువ చూపే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: