రాష్ట్రంలో ఈఎస్‌ఐ కుంభకోణం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంలో గత టీడీపీ ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ ఎస్పీ వెంకట్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఎస్పీ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. టెలీసర్వీసెస్‌ కు చెందిన కాల్‌ లిస్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ ది కాకుండా తెలంగాణాది ఇచ్చారని తెలిపారు. ఆ కాల్‌ లిస్టును పరిశీలించగా బోగస్‌ అని తేలిందన్నారు. మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీహెల్త్ సర్వీసెస్ అంశాల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. 

 

 

నకిలీ కొటేషన్స్ పెట్టి కాంటాక్ట్ దక్కించుకున్నారని, అనవసర మందులు కొన్నారని ఎస్పీ వెంకట్‌ రెడ్డి చెప్పారు. కొనుగోలు చేసిన మందులను వినియోగించ లేదని, చాలా ఆసుపత్రుల్లో డ్రగ్స్ గోడౌన్స్‌ కే పరిమితమయ్యాయని వెల్లడించారు. అలాగే పేషెంట్స్‌ ఫోన్లు చేయకున్నా.. చేసినట్లు బిల్లులు చూపించారని ఎస్పీ వెంకట్‌ రెడ్డి తెలిపారు. సీవరేజ్‌ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 

 

 

ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినా.. పాత ఆస్పత్రిలోని ప్లాంట్‌ పేరుతోనే బిల్లులు పొందారని వివరించారు. ఇందుకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సిఫార్సు చేశారని వెల్లడించారు. అవసరానికి మించి మందులు కొనుగోలు చేశారని, చెల్లింపుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఇందుకు సంబంధించి మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు. 

 

 

3 నెలల పాటు విచారణ జరిపామని, గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. ఇందులో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించారని, ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉందని తెలిపారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ పేర్లు ఈఎస్ఐ కుంభకోణంలో వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ..   ఈఎస్‌ఐలో తన పాత్ర ఉందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకే పనులు నిర్వహించామని, టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ అమలు చేయమని అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు కేంద్రం నుంచి లేఖలు వచ్చాయన్నారు. మన రాష్ట్రం కంటే ముందుగా తెలంగాణలో ప్రారంభించారని, అదే మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని తాను అధికారులకు లేఖ పంపానన్నారు

 

వ్యక్తి గతంగా ఏ ఒక్కరికో దీనిని కేటాయించాలని తాను ఆదేశించలేదని, కేంద్రం ఆదేశాల మేరకే నడుచుకున్నామన్నారు. వైసీపీ నేతలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అవినీతికి తాను ఎప్పూడూ దూరమేనని, రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవచ్చన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఆ నాటి రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: