అక్కడ అధికారులు చెప్పిందే వేదం. గ్రామసర్పంచ్‌ల ఇష్టాయిష్టాలకు అసలు తావేలేదు. సర్కార్ ట్రాక్టర్ కొనుగోలు చేయాలని చెప్పినా స్వప్రయోజనాల కోసం అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఏకంగా సర్కారు లక్ష్యాన్నే నీరు గారుస్తున్నారు. 

 

పల్లె ప్రణాళికపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పథకం విజయవంతం చేయటానికి గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరిస్తున్నారు. ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతీ గ్రామ పంచాయితీకి ట్రాక్టర్ ఉండాలని ఆదేశాలిచ్చింది. చిన్న గ్రామ పంచాయితీలకు ఎలాంటి ట్రాక్టర్ కొనాలో, పెద్ద గ్రామపంచాయితీలకు ఏ ట్రాక్టర్ కొనాలో ప్రభుత్వమే నిర్ణయించింది. అయితే... దీనికి సర్పంచ్‌లు ముందుగానే చెక్‌లు-డీడీలు తీయాల్సి ఉంటుంది. అంతకంటే ముందే ఏ ట్రాక్టర్ కొనాలనేది గ్రామ పంచాయితీ  తీర్మానం చేయాలి. కొన్ని జిల్లాల్లో సర్కారే కొంత డబ్బు సైతం ఇస్తోంది. మార్జిన్ మనీ ఇస్తే బ్యాంక్ లోన్ కట్టి వాయిదా పద్దతిన డబ్బులు చెల్లించాలి. దీంతో తమది కొత్త గ్రామ పంచాయితీ అని మార్జీన్ మనీ ఎక్కడ నుంచి తీసుకురావాలని అడుగుతున్నారు కొంతమంది సర్పంచ్‌లు. ఇంకొంతమంది కొనుగోలు చేయడానికి అస్సలు ముందుకు రావడం లేదు. మరి కొంతమంది అయితే గంపగుత్తగా ఒకే కంపెనీతో డీల్ మాట్లాడుకొంటున్నారు. సర్పంచ్‌లంతా ఈ కంపెనీ ట్రాక్టర్లు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలిస్తున్నారు అధికారులు.

 

తాజాగా మంచిర్యాల జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులు...జిల్లా స్థాయిలోని ఒకరిద్దరు అధికారులు సర్పంచ్‌లందరిని ఫలానా ట్రాక్టరే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేశారు. ఇక్కడ ఓ అధికారికి సంబంధించిన బంధువుకు ట్రాక్టర్ షోరూం ఉంది. 
జిల్లా కేంద్రంలోని ఒకే షోరూం నుంచి ఎక్కువ జీపీలకు ట్రాక్టర్లు రిలీజ్ అయ్యాయి. అయితే ముందే కమీషన్ మాట్లాడుకొని ఇలా చేస్తున్నారని సర్పంచ్‌లు కుమిలిపోతున్నారు. ఇంకొంతమంది తమకు ట్రాక్టర్లు అవసరం లేదంటున్నారు.  

 

ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సర్పంచ్ లు ట్రాక్టర్లు కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 467 జీపీలుంటే ఇప్పటి వరకు 182 ట్రాక్టర్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఇక్కడా చోటామోటా నాయకులు తమకు తెలిసిన నేత షోరూంలోనే ట్రాక్టర్ తీసుకోవాలని బెదిరింపులకు  సైతం దిగుతున్నారు. 

 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1508 గ్రామ పంచాయితీలున్నాయి. అందులో సగం గ్రామపంచాయితీలు ఇంకా ట్రాక్టర్లు కొనలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలో ఒకే రకమైన ట్రాక్టర్లు కొనాలని డిసైడ్ చేశారట. అలా ఎందుకు చేశారని నిలదీస్తే అసలు ముచ్చట బయటపడింది. ఒక్క ట్రాక్టర్‌కు సదరు కంపెనీ వారు 30 నుంచి 40 వేలు ఎమ్మెల్యేకు వాటా ఇస్తున్నారని టాక్. అలాగే సర్పంచ్‌కు సైతం పదివేలు ఇస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. సర్కార్ సంకల్పం మంచిదే అయినా మధ్య దళారులుగా అవతారం ఎత్తి జేబులు నింపుకునే వారు తయారవుతున్నారు. ఫలితంగా ఈ లక్ష్యం నీరుగారే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: