ఏపీ ఈఎస్ఐ స్కామ్ డొంక క్రమంగా కదులుతోంది. ఇప్పటికే ఈ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో ఒక్క అచ్చెన్నాయుడు మాత్రమే కాదట. ఇంకో మాజీ మంత్రికీ భాగస్వామ్యం ఉందట. అంతే కాదు.. మరో మంత్రి కుమారుడు కూడా ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించాడట.

 

ఈ వివరాలను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ వెంకట్‌ రెడ్డి వెల్లడించారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని ఆయన తెలిపారు. మందుల కొనుగోళ్లు, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషీన్లు, టెలీహెల్త్ సర్వీసెస్ అంశాలలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ వెంకట్‌ రెడ్డి తెలిపారు.

 

 

టెలీ సర్వీసెస్‌కు చెందిన కాల్‌లిస్ట్‌ ఏపీది కాకుండా తెలంగాణాది ఇచ్చారని.. ఆ కాల్‌లిస్టును పరిశీలించగా బోగస్‌ అని తేలిందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ వెంకట్‌ రెడ్డి వివరించారు. పేషెంట్స్‌ ఫోన్లు చేయకున్నా చేసినట్లు బిల్లులు చూపించారని ఎస్పీ వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఆస్పత్రులలో సీవరేజీ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, ఆదోనిలోని ఆస్పత్రిని మార్చినా.. పాత ఆస్పత్రిలోని ప్లాంట్‌ పేరుతోనే బిల్లులు పొందారని ఎస్పీ వెంకట్‌ రెడ్డి తెలిపారు.

 

ఇందుకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు చేశారని ఎస్పీ వెంకట్‌ రెడ్డి వెల్లడించారు. ఓ మాజీ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ స్కామ్ లో ముగ్గురు డైరెక్టర్లు కీలక పాత్ర పోషించిన విషయం కూడా ఇంతకు ముందే బయటకు వచ్చింది. అక్రమాలకు పాల్పడ్డ వారి మీద క్రిమినల్‌ కేసుల నమోదుకు సిఫారసు చేశామని వెంకటరెడ్డి వివరించారు. అయితే జగన్ సర్కారు అక్రమాలను నిలదీస్తున్నందుకే అచ్చెన్నను టార్గెట్ చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: