ఏపీలో రాజ్యసభ సీట్ల కోసం పోరు మొదలైంది. వైసీపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పార్టీలో ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ రేసులో వీరికి స్థానం కల్పించిందంటూ కొంతమంది పేర్లతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 
 
రాజ్యసభ సీట్ల కోసం వైసీపీ పార్టీలో పోటీ గట్టిగా ఉందని చెప్పవచ్చు. వైసీపీ పార్టీకి నాలుగు సీట్లు దక్కనుండగా ఏపీ నుండి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరు...? అనేది రాజకీయవర్గాల్లో చర్చనీయంశమైంది. రాజ్యసభ రేసులో గత కొంతకాలం నుండి చిరంజీవి, వైయస్ షర్మిల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ పార్టీ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం మేరకు రాజ్యసభ రేసులో వీళ్లిద్దరి పేర్లు లేవని సమాచారం. 
 
ప్రస్తుతానికి రాజ్యసభ రేసులో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆళ్ల 2014లో వైసీపీ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సీఎం జగన్ ఆళ్లకు రాజ్యసభ సీటు విషయంలో హామీ ఇచ్చాడని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీద మస్తాన్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలలో ఒకరికి రాజ్యసభ సీటు దక్కనుందని తెలుస్తోంది. 
 
మరో సీటు విషయంలో సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పేరు వినిపిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ ను వైవీ సుబ్బారెడ్డి త్యాగం చేశారు. అందువలన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు దక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగో సీటు విషయంలో బీజేపీ పేరు తెరపైకి వస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగన్ ను రాజ్యసభ సీటు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ నాలుగు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతాయి...? తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: