ట్రంప్ వచ్చేస్తున్నారు..! సకుటుంబ సమేతంగా రేపు భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు..! అమెరికా అధ్యక్షుడు గుజరాత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి..! రెండు రోజుల పాటు ట్రంప్ అండ్ కో ఏం చేస్తారు..? ఏ టైమ్‌లో ఎక్కడికి వెళ్తారు ? ఎవరిని కలుస్తారు ?  ఎయిర్‌ఫోర్స్ వన్ అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయినప్పటి నుంచి ఢిల్లీలో టేకాఫ్ తీసుకునే వరకు ట్రంప్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది...?

 

భారత్ అమెరికా దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న డొనాల్డ్ టూర్‌కు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. రెండు రోజుల పర్యటన కోసం వస్తున్న ట్రంప్ దాదాపు 36 గంటల పాటు భారత్‌లో ఉంటారు. ట్రంప్ తో పాటు ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఇవాంకా టంప్, ఆమె భర్త కూడా ఇండియా వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం రాత్రి వరకు వీళ్లంతా ఇండియాలోనే ఉంటారు. ట్రంప్ రెండు రోజుల షెడ్యూల్ టైమ్ టు టైమ్ ఇలా ఉంది.

 

ఫిబ్రవరి 24 సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు  అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ అహ్మదాబాద్‌లో ల్యాండ్ అవుతుంది. ట్రంప్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అహ్మదాబాద్ చేరుకుటుంది. ప్రధానమంత్రి మోడీ స్వయంగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టు నుంచి 22 కిమీ దూరంలో ఉన్న మొతేరా స్టేడియం వరకు ట్రంప్‌ , మోడీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొంటారు. మార్గం మధ్యలో సబర్మతి ఆశ్రమంలో ఆగి గాంధీకి నివాళులు అర్పిస్తారు ట్రంప్. గాంధీ జ్ఞాపకార్ధం చరకా, గాంధీ జీవిత చరిత్రకు చెందిన పుస్తకాలు ట్రంప్‌కు బహుకరిస్తారు మోడీ.

 

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ట్రంప్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం చేరుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించి... నమస్తే ట్రంప్ ఈవెంట్‌లో పాల్గొంటారు. దాదాపు లక్షన్నర ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరవుతున్న ఈ  ఈవెంట్‌లో మోడీతో కలిసి ప్రసంగిస్తారు డొనాల్డ్ ట్రంప్.  

స్డేడియం ప్రారంభోత్సవం తర్వాత మోడీ.. ట్రంప్‌కు విందు ఇస్తారు.  మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో కలిసి ఆగ్రా బయలుదేరతారు యూఎస్ ప్రెసిడెంట్. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆగ్రా చేరుకుని తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. 45 నిమిషాల పాటు ఇద్దరూ తాజ్‌మహల్ వద్దే గడుపుతారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలు దేరి వెళ్తారు.

 

ఆగ్రా నుంచి సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకుని అక్కడే బస చేస్తారు ట్రంప్. ఫిబ్రవరి 25 మంగళవారం పది గంటలకు  అమెరికా అధ్యక్షుడికి రాష్ట్రపతి  భవన్‌లో స్వాగతం కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్...ట్రంప్ దంపతులకు స్వాగతం పలుకుతారు. మంగళవారం ఉదయం 10.45 నిమిషాలకు ట్రంప్, మెలానియా ట్రంప్... రాజ్‌ ఘాట్ చేరుకుని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.  

 

మంగళవారం ఉదయం 11.30 గంటలకు ట్రంప్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు చేరుకుంటారు. మోడీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. 
ట్రంప్, మోడీ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమయంలో మెలానియా ట్రంప్... ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారు. ఢిల్లీ విద్యావిధానం  గురించి తెలుసుకుంటారు. 

 

మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఈఓల రౌండ్ టేబుల్‌ సమావేశంలో ట్రంప్ పాల్గొంటారు. రెండు దేశాలకు చెందిన అధికారులు, వ్యాపారవేత్తలు ఈ భేటీలో పాల్గొంటారు. సీఈవో రౌండ్‌టేబుల్ సమావేశం యూఎస్ ఎంబసీలో జరుగుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి కోవింద్ ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు ట్రంప్. మంగళవారం రాత్రి పదిగంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఫోర్స్ వన్‌లో తిరిగి అమెరికాకు బయలుదేరతారు ట్రంప్ అండ్ కో... అక్కడితో ఆయన భారత పర్యటన ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: