ఏపీ ఎన్జీవోలకు జగన్ సర్కార్ దిమ్మతిరిగే షాకిచ్చింది. సంఘం గుర్తింపును రద్దు ఎందుకు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని.. కర్నూలుకు చెందిన ఒక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ.. సదరు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఈ షోకాజ్‌ నోటీసు ఇవ్వడం జరిగింది. 2018లో ఏపీఎన్జీవో అసోషియేషన్‌ తిరుపతిలో సమావేశం నిర్వహించింది. 

 

 

ఈ కార్యక్రమానికి అప్పటి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రుల్ని ఆహ్వానించారు. ఈ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తప్పు బడుతూ ఆరోపణలు చేస్తోంది. 2001లో ఇచ్చిన జీవో ప్రకారం 264లోని రూల్‌ 3(2), (ఏ)(4) ప్రకారం సభ్యులు కాని వారిని అసోసియేషన్‌ మీటింగ్‌కు పిలిస్తే.. ఆ సంఘం గుర్తింపును రద్దు చేయొచ్చు అనే నిబంధన ఉంది. ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులుకాని చంద్రబాబును, ఇతర మంత్రులను ఎలా ఆహ్వానించారని నోటీసులో ప్రస్తావించారు. చంద్ర బాబు తీరుపై మండిపడుతూ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని వినికిడి. 

 

అప్పటి సీఎం, మంత్రుల్ని ఆహ్వానించినందుకు అసోసియేషన్‌ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ ప్రశ్నించింది. అలాగే ఎన్జీవో సంఘంలో సభ్యులు ఎంతమంది బైలాస్‌, ఆడిట్‌, వార్షిక నివేదికలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. జీవోలోని పేరా 3(2) (ఏ)(ఈ) ప్రకారం కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ ఎన్జీవో సభ్యుల సంఖ్య వివరాలు తెలపలేదని.. జాబితాను తారుమారు చేశారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

 

 

ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌కు ప్రభుత్వమిచ్చిన స్థలాలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసు పంపారు. ఇలాంటి అసాంఘిక చర్యలు తమ ప్రభుత్వం ఎన్నడూ చేయబోదని, అవినీతి పైన ఎక్కు పెట్టిన బాణం వై.యస్.ఆర్.సి.పి అని ఈ సందర్భంగా జగన్ కార్యకర్తలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: