వైసీపీ ప్రభుత్వం విజయవాడ వాసులకు శుభవార్త చెప్పింది. ఎన్నో రోజుల నుండి విజయవాడ వాసులు ఎదురుచూస్తున్న ఫ్లై ఓవర్ ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్ర విభజన తరువాత విజయవాడ నగరంలో ట్రాఫిక్ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇరుకు రోడ్లు, వాహనాల రద్దీతో విజయవాడ ట్రాఫిక్ రోజురోజుకు నరకంలా మారుతోంది. వాహనదారులు ప్రధాన జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీఐపీల తాకిడి ఎక్కువ కావడం, నగరంలో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో వాహనదారులను ట్రాఫిక్ కష్టాలు బెంబేలెత్తిస్తున్నాయి. 
 
ఇన్నిరోజులు ట్రాఫిక్ వలన ఇబ్బందులు పడిన విజయవాడ వాహనదారులకు మరికొద్ది రోజుల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వైసీపీ ప్రభుత్వం చొరవతో కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. అధికారులు మార్చి నెల చివరివారం నాటికి పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. కలెక్టర్ ఇంతియాజ్ ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించి ఆ తరువాత వంతెనపై రాకపోకలకు అనుమతి ఇస్తామని చెప్పారు. 
 
సోమా ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ 325 కోట్ల రూపాయల వ్యయంతో 2.6 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. 2015 సంవత్సరం డిసెంబర్ నెల చివరివారంలో ఫ్లై ఓవర్ పనులు మొదలయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఫ్లై ఓవర్ విషయంలో నిర్లక్ష్యం వహించటంతో ఫ్లై ఓవర్ నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం ఫ్లై ఓవర్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. 
 
ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పనుల్లో వేగం పుంజుకుంది. కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులతో, కాంట్రాక్టరు ప్రతినిధులతో చర్చలు జరిపి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏప్రిల్ నెల చివరి వారం నుండి ప్రజలకు ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. వైసీపీ ప్రభుత్వం కృషి వలన బెజవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు అతి త్వరలోనే తీరనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: