గర్భం రాకపోవడానికి స్త్రీలెంత కారణమో, పురుషులూ అంతే. పురుషునిలో వీర్య  స్ఖలనం వున్నా అందులో వీర్యకణాలు వుండకపోవచ్చు. ఒకవేళ వున్నా తగినన్ని లేక పోవచ్చు. పైగా చక్కని కదలిక లేకపోవచ్చు. ఇటువంటప్పుడు స్త్రీలో అంతా చక్కగా వున్నాగర్భం రాదు. వీర్యం పలచన, చిక్కద‌నాన్ని బట్టి గర్భం రావడం ఆధారపడిలేదు. సాధారణంగా పురుషుడు స్ఖలించే వీర్యం 2 నుంచి 6 ఎం.ఎల్‌. వుంటుంది. అలా స్ఖలించిన ప్రతీ యం.యల్‌. లో 60 నుంచి 120 మిలియన్ల వీర్య కణాలు వుంటాయి. ఇంతకంటే ఎక్కువ కూడా వుంటాయి. చక్కని సంతాన సాఫల్యత కలిగిన వీర్యంలో అన్ని వీర్యకణాలూ చక్కని కదలిక, చక్కని రూపాన్ని కలిగి వుంటాయి. ఎవరిలోనైనా వీర్యం కనీసం 2 యం.యల్‌. వుండి, ప్రతీ యం.యల్‌.కి 60 మిలియన్‌ వీర్యకణాలు వుండి, 6-8 గంటల తరువాత కూడా వాటిల్లో కనీసం 40 శాతం చక్కని కదలిక కలిగి వుంటేనూ, మొత్తం వీర్యకణాల్లో 80 శాతం వీర్యకణాలు అసహజ రూపులేకుండా సహజరీతిలో వుంటే గ‌నుక ఆ వీర్యం గర్భధారణ సామర్థ్యం కలిగినదిగా వైధ్యులు పేర్కొంటారు. ఒకవేళ వీర్యం 1-2 యం.యల్‌.కి మించకుండా, ప్రతీ యం.యల్‌.కి 30 మిలియన్లు లేదా ఇంకా తక్కువ వుంటేనూ, 6-8 గంటల తరువాత వీర్యకణాలు 30 శాతమే చైతన్య వంతంగా వుంటే, 50 శాతం వీర్యకణాలు అసాధారణ రూపం కలిగి వుంటే ఆ వీర్యాన్ని మోడరేట్‌ ఫెర్టిలిటీ (ఒక మాదిరి గర్భధారణ సామర్థ్యం) కలదిగా పేర్కొంటారు. 

 

 

గర్భం రావడనికి త్వ‌ర‌గా, సులువుగా వీర్యం కనీసం 2 యం.యల్‌. వుండాలి. 1 యం.యల్‌.లో 60 మిలియన్లు వీర్యకణాలు వుండలి. అంతేకాకుండ వాటిల్లో 80-90 శాతం బాగా చైతన్యవంతంగా వుండాలి. అసాధారణ వీర్యకణాలు 20 శాతానికి మించి వుండకూడదు. కొందరికి పుట్టుకతోనే క్రోమోజోమ్స్‌లో అసాధారణ పరిస్థితి వుండి వృషణాలు వీర్య కణాలని ఉత్పత్తి చేయవు. కొందరు పురుషులలో మశాచి, గవద బిళ్ళలు, పొంగు, విషజ్వరాలు రావడం వల్ల వృషణాలు వాచి శాశ్వతంగా వీర్యకణాల ఉత్పత్తి లేకుండ అవుతుంది. వృషణాలకి క్షయ, లెప్రసీ గనేరియా వచ్చినా, ఇతరత్రా కంతులు వచ్చినా వీర్యకణాల ఉత్పత్తి దెబ్బతినవచ్చు. వృషణాలు బీజకోశంలోకి దిగకుండ పొత్తికుపుపైనే వుండిపోయిన వారిలో వీర్యకణాల ఉత్పత్తి దెబ్బతినవచ్చు. ఇటుంటి పరిస్థితులన్నీ గర్భధారణకు అవరోధం కలిగిస్తాయి. కొందరికి బీజకోశం రక్తనాళాలు ఉబ్బి వీర్యకణాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. 

 

బీజకోశం రక్తనాళాలు ఉబ్బడాన్ని 'వేరికోసీల్‌' అంటారు. వేరికోసీల్‌ వుండి, వీర్యక‌ణాల ఉత్పత్తి తక్కువ వున్నప్పుడు ఆపరేషన్‌ చేయాలి. వేరికోసీల్‌ ఆపరేషన్‌ చేయడం వల్ల వీర్యకణాల సంఖ్య పెరగడం, కదలిక పెంపొందం జరిగి సంతానం కలిగే అవకాశం వుంది. అంతకుముందు కొందరికి వీర్యకణాలు బాగానే వుండి ఏ కారణం లేకుండ తగ్గిపోవచ్చు. ఇటువంటప్పుడు మంచి పోషకాహారం తీసుకోవడం, చన్నీళ్ళ స్నానం చేయడం, వృషణాలకి చల్లనిగాలి తగిలేటట్లు నూలు దుస్తులు వాడటం, ఉలెన్‌-నైలాన్‌ డ్రయర్లు మానివేయడం- ఇలా చేస్తే కొద్దినెలల్లోనే వీర్యకణాల సంఖ్య తిరిగి పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: