బిక్షాటన చేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ప్రతిపాదనతో ముందుకొచ్చింది. అందులో భాగంగా జీహెచ్ఎంసీని ప్రప్రధమంగా ఎంచుకుంది. నగరంలో చాలా చోట్ల కూడళ్ల వద్ద, ఆలయాల వద్ద పండుగ సందర్భాల్లో బిక్షాటన చేసే వారు కనిపిస్తూ ఉంటారు. అయితే, బిక్షాటన చేసే వారికి పూర్తి స్థాయిలో పునరావాసం, ఆర్థిక స్వాలంబన కల్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలో మార్కెటింగ్ టై అప్ పెట్టుకుని, బిక్షాటన చేసే వారికి అనువైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, హైదరాబాద్ నగరాన్ని బిక్షాటన రహిత నగరంగా తీర్చిదిద్దనున్నారు.

 

 

ఈ క్రమంలో పైలట్ ప్రాజెక్టు క్రింద జీహెచ్ఎంసీని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త‌ శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా ప‌ది న‌గ‌రాల‌ను పైలెట్ ప్రాజెక్ట్ కింద చేప‌డుతున్న‌ట్లు ఈ సందర్భంగా తెలిపారు. 2020 ఏప్రిల్ నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌ను అమ‌లు చేసేందుకు స‌మ‌గ్ర కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని సూచించారు. బెగ్గ‌ర్స్ పున‌రావాసానికి రూ. 10కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు రెడ్డి సుబ్రమణ్యం తెలిపారు.

 

డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్న‌ద‌ని, పేద‌ల‌కు అన్న‌పూర్ణ భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ద‌ని అభినందించారు. ప్ర‌తి వ్య‌క్తి గౌర‌వంగా బ్ర‌తికేందుకు అవ‌కాశం క‌ల్పించుట‌లో భాగంగా బెగ్గ‌ర్స్ సామాజిక, ఆర్థిక, కుటుంబ‌ ప‌రిస్థితుల‌ను గుర్తించాల‌ని తెలిపారు. ఈ అంశంలో ఎన్‌.జి.వోల‌తో పాటు క‌మ్యునిటి పాత్ర కీల‌క‌మైన‌ద‌ని తెలిపారు. బెగ్గ‌ర్స్‌కు పున‌రావాసం క‌ల్పించ‌డంతో పాటు, వారి మాన‌సిక, శారీర‌క రుగ్మ‌తుల‌కు వైద్య సేవ‌ల‌ను అందించాల‌ని తెలిపారు. 

 

 

స్వ‌తంత్రంగా బ్ర‌తికేందుకు జీవ‌నోపాధిని క‌ల్పించే రంగంలో నైపుణ్య శిక్ష‌ణ‌తో పాటు మార్కెటింగ్‌ను అనుసంధానం చేయాల‌ని సూచించారు. సంవ‌త్స‌ర కాలంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో బెగ్గ‌ర్స్‌కు పూర్తిస్థాయిలో పున‌రావాసం క‌ల్పించుట‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఉండాల‌ని తెలిపారు. బెగ్గింగ్‌లో ఉన్న కుటుంబాల పిల్ల‌ల‌కు విద్యా స‌దుపాయాల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. విద్య వ‌ల‌న ఆయా కుటుంబాల వ్య‌వ‌హార శైలీలో మార్పు వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డినారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: