ఢిల్లీలో కేజ్రీ వర్సెస్ కేంద్రం రాజకీయాలు ట్రంప్ టూర్‌కు కూడా చుట్టుకున్నాయి..! ట్రంప్‌తో పాటు భారత పర్యటనకు వస్తున్న ఫస్ట్ లేడీ మెలానియా...ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్‌, మనీష్ సిసోసియాను కేంద్రం ఆహ్వానించలేదు. దీనిపై ఆప్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో  ఉన్న స్కూల్‌కు మెలానియా వస్తుంటే సీఎంను పిలవరా అని ప్రశ్నిస్తోంది....దీని వెనుక బీజేపీ హస్తముందని విమర్శిస్తోంది.

 

ఢిల్లీ ప్రభుత్వానికి , కేంద్రానికి మధ్య ట్రంప్ టూర్ కొత్త చిచ్చు పెట్టింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి , కేంద్రానికి మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆప్ , బీజేపీ మధ్య మాటల యుద్ధం తగ్గింది అనుకుంటున్న సమయంలో అమెరికా ప్రెసిడెంట్ టూర్‌తో మళ్లీ రాజకీయం మొదలైంది. వచ్చే సోమవారం నాడు ట్రంప్‌తోకలిసి అహ్మదాబాద్ వస్తున్న ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... మంగళవారం ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లపోతున్నారు. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. విద్యావిధానంలో కీలక సంస్కరణను అమలు చేసింది. ప్రైవేటు స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో  విద్య అందిస్తోంది.

 

భారత్‌లో అడుగుపెట్టగానే ట్రంప్‌తో పాటు అహ్మదాబాద్ అగ్రాలో పర్యటించనున్న మెలానియా ట్రంప్... 25న ఢిల్లీ వెళ్తారు.  ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు ట్రంప్ -మోడీ  సమావేశమయ్యే సమయంలో మెలానియా ట్రంప్... ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్‌కు వెళ్తారు. విద్యార్ధులను ఒత్తిడి నుంచి దూరం చేయడానకి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు హ్యాపినెస్ క్లాస్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. చిన్నారుల్లో ఉత్సాహం నింపే విధంగా ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసింది. మెలానియా ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులతో ముచ్చటిస్తారు. మెలానియా వెళ్లే స్కూల్‌ వివరాలను కేంద్రం గోప్యంగా ఉంచింది.

 

ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని స్కూల్ కావడంతో మెలానియా ట్రంప్‌తో పాటు కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే వాళ్లిద్దరికీ ఆహ్వానాలు అందకపోవడంతో ఆప్ కస్సుమంటోంది. సీఎం, డిప్యూటీ సీఎంలను పిలవకపోవడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. ఆహ్వానం అందకపోయినా తాము చేసిన పనిఏంటో ప్రపంచానికి తెలుస్తుందని ట్వీట్స్ యుద్ధం మొదలుపెట్టారు. ఆప్ విమర్శలను బీజేపీ కూడా తీవ్రంగానే తీసుకుంది. ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసి ప్రపంచం ముందు భారత్ పరువు తీయవద్దంది. ట్రంప్, మెలానియా ట్రంప్‌ పర్యటనలో ఎవరెవరు ఉండాలో తాము నిర్ణయించలేమంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: