ఏపీలో మహిళా నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే...అది అధికార వైసీపీనే. ఈ పార్టీలోనే ఎక్కువ మంది మహిళా నేతలు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఇక జగన్ కేబినెట్‌లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. అటు పలు నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు అవకాశం ఇచ్చారు. ఈ విధంగా అన్నీ విధాలుగా మహిళలకు జగన్ అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఓ ఇద్దరు మహిళా నేతలు తమకు కూడా ఛాన్స్ ఇవ్వాలని జగన్‌ని కోరుతున్నట్లు తెలుస్తోంది.

 

త్వరలో ఏపీలో ఖాళీలు కానున్న రాజ్యసభ సీట్లని తమకు కూడా కేటాయించాలని, జగన్‌తో సన్నిహితంగా ఉండే నేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారట. ఇక ఈ విధంగా లాబీయింగ్ చేస్తున్న మహిళా నేతలు ఎవరో కాదు. ఎన్నికలు ముందు వైసీపీలో చేరిన శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లీ కృపారాణి, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకలేనట. 2009 ఎన్నికల్లో శ్రీకాకుళంలో ఎర్రన్నాయుడు లాంటి దిగ్గజ నేతని ఓడించి సత్తా చాటిన కృపారాణి, కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి అయిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోతుండటంతో, మొన్న ఎన్నికల్లో వైసీపీలోకి వచ్చారు.

 

అప్పుడే ఆమె శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించారు గానీ, జగన్ మాట ప్రకారం దువ్వాడ శ్రీనివాస్‌కు అవకాశం దక్కింది. దీంతో ఆమె ఇప్పుడు రాజ్యసభపై కన్నేశారు. సీనియర్ నాయకురాలైన తనకు రాజ్యసభ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారట. అయితే రాజ్యసభ సీట్లు ఉన్నవి నాలుగు. వాటికి చాలామంది నేతలు రేసులో ఉండటంతో ఆమెకు సీటు దక్కడం కష్టమే అంటున్నారు.

 

అటు కర్నూలుకు చెందిన బుట్టా రేణుక కూడా సీనియర్ నేతల ద్వారా రాజ్యసభ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అసలు రేణుక 2014లో వైసీపీ తరుపున కర్నూలు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయి, 2019 ఎన్నికల ముందు బాబు హ్యాండ్ ఇస్తే, మళ్ళీ వైసీపీలోకి వచ్చేశారు. మళ్ళీ పార్టీలోకి వచ్చిన ఆమెకు సీటు రాలేదు. దీంతో ఆమె ఇప్పుడు రాజ్యసభ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆమెకు రాజ్యసభ వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: