టీడీపీలో మరో సీనియర్ నేతకు ఫ్యాన్ మీద గాలి మళ్లిందని తెలుస్తోంది. వీలు చూసుకుని ఆ నాయకుడు బాబుకు హ్యాండ్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల దెబ్బకు చాలామంది తట్టా బుట్టా సర్దేసుకుని వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇటీవల కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.

 

ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న కాపు నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా చంద్రబాబుకు షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన వేదవ్యాస్, కృష్ణా జిల్లా పెడన(మల్లేశ్వరం పాత నియోజకవర్గం) నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచారు. ఇక తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో మళ్ళీ అటు వెళ్ళిపోయి, 2009 ఎన్నికల్లో మచిలీపట్నం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 

నెక్స్ట్ ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, కాంగ్రెస్ నేత అయిపోయారు. కానీ రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా అయిపోవడంతో 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున మళ్ళీ పెడన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన నేత సవ్యంగా ఉండకుండా అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు కూడా రాలేదు. పైగా టీడీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆయన అసలు అడ్రెస్ లేరు.

 

దానికితోడు ఆయనకు టీడీపీలో ఉంటే సీటు కూడా వచ్చే అవకాశాలు కనబడటం లేదు. దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీలోకి వెళితే ఏదొక ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే వైసీపీలో ఉన్న తన సన్నిహితుల ద్వారా ఆ పార్టీలోకి వెళ్ళేందుకు చూస్తున్నారట. మొత్తానికైతే కాపు నేత ఇక సైకిల్ తొక్కలేనంటున్నారు. అదే సమయంలో ఫ్యాన్ గాలి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: