విదేశీ పక్షుల కిలకిలారావాలతో వరంగల్ జిల్లా పల్లెలు మురిసిపోతున్నాయి.  వేల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చిన పక్షులు జిల్లా వాసులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పక్షులు చేసే విచిత్రమైన విన్యాసాలను చూస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాలు పులకించిపోతున్నాయి. జిల్లాకు చేరుకున్న విదేశీ అతిధులు తెగ సందడి చేస్తున్నాయి. 

 

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో విదేశీ పక్షులు ప్రతీ ఏటా సందడి చేస్తుంటాయి. దేశాల సరిహద్దులు దాటుకుని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వలస వస్తుంటాయి. రంగు రంగుల రెక్కలతో కనిపించే ఈ పక్షులను స్థానికంగా ఎర్రమూతి కొంగల పేరుతో పిలుస్తారు. వందల సంఖ్యలో వచ్చే ఈ విదేశీ పక్షులతో పల్లెలు అహ్లాదంగా మారిపోతాయి. ప్రతి ఏటా విదేశాల నుంచి వచ్చిన కొంగలతో జిల్లాలోని కొన్ని గ్రామాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చి విడిది చేస్తుంటాయి విదేశీ పక్షులు. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు ఎదిగేదాకా ఇక్కడే ఉంటాయి. చిన్నారి పక్షులు ఎగిరి శక్తి సంపాదించుకునేంతవరకు గ్రామాల్లోనే ఉండిపోతాయి. రెక్కలు వచ్చిన తర్వాత మళ్లీ తమ దేశాలకు ఎగిరిపోతాయి. 

 

ఇక...వేసవి విడిదికి వచ్చిన ఈ విదేశీ పక్షులు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. వచ్చిన మొదటి నెలలో గూడు తయారు చేసుకుంటాయి. ధృడమైన వృక్షాల కొమ్మలను ఆవాసాలుగా మార్చుసుకుంటాయి. ఆడ పక్షులు బాతు గుడ్డుకు రెండింతల పరిమాణంతో కూడిన గుడ్లను పెడుతుంది. వాటిని పొదిగి ఇక్కడే పిల్లలను చేస్తుంది. ప్రతీ పక్షి సుమారు నాలుగు నుంచి ఐదు గుడ్లను పెడుతుంది.  

 

చెరువులోని చేపలే ఈ పక్షులకు ప్రధాన ఆహారం. పిల్లలను, గూడును పాములు, కోతుల నుంచి సంరక్షించడానికి ఆడపక్షి గూడు వద్దే కాపలాగా ఉంటుంది. ఆహారం సేకరణ పూర్తి బాధ్యత మగ పక్షిదే. దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల నుంచి మగ పక్షులు గుంపులుగా వెళ్లి చేపలను తీసుకొచ్చి ఆహారంగా అందిస్తాయి. నీటిని సైతం నోటితో తీసుకొచ్చి పిల్లలు, ఆడపక్షుల దాహార్తిని తీరుస్తాయి. మిగిలిన నీటిని పిల్లలపై చల్లుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. విదేశీ పక్షుల రాకతో గ్రామాలకు నూతన కళ వచ్చినట్లుగా భావిస్తారు స్థానికులు. వీటిని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: