అగ్ర‌రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం భార‌త్‌కు వ‌స్తున్నారు. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఆయ‌న భార‌త గ‌డ్డ‌పై తొలిసారి అడుగు పెట్ట‌నున్నారు. ప్ర‌పంచ దేశాల్లో ప‌ర్య‌ట‌నలు ఎన్ని చేసినా.. భార‌త్‌లో ప‌ర్య‌ట‌న అనేస‌రికి అటు అమెరికాలోను, ఇటు భార‌త్‌లోనే కాకుండా ఆసియా దేశాల్లో చాలా ఆస‌క్తి ఉంటుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలే! ఈ క్ర‌మంలో ఇప్పుడు ట్రంప్ ప‌ర్య‌ట‌న‌పై భార‌త్‌లోని కార్పొరేట్లు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.

 

ఈ క్ర‌మంలోనే ట్రంప్‌తో కార్పొరేట్ దిగ్గ‌జాలు భేటీ అవుతున్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. అస‌లు ఈ ప‌ర్య‌ట‌న‌లో ట్రంప్ నుంచి భార‌త కార్పొరేట్లు ఏం ఆశిస్తున్నారు?  మ‌రి అవి నెర‌వేరుతాయా? అనేది ఆసక్తిగా మారింది. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల మధ్య కొన్ని అంశాలు నలుగుతున్నాయి. వీటిని ప‌రిష్క‌రించాల‌ని దేశంలోని కార్పొరేట్ దిగ్గ‌జాలు కోరుతున్నాయి. భారత్‌ ఎగుమతి చేసే కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధిస్తోంది.

 

అలాగే, జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ) కింద ఎగుమతి సంస్థలకు ఒనగూరే ప్రయోజనాలు ఎత్తివేసింది. వీటన్నింటినీ పునఃసమీక్షించాలని దేశీ కంపెనీలు కోరుతున్నాయి. అలాగే, వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరిం గ్, ఆటో పరికరాలు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలంటున్నాయి. మరోవైపు, భారత్‌లో తమ వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, వైద్య పరికరాల విక్రయానికి తగిన అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది.

 

ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్‌ భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐఐ అంచనాల ప్రకారం.. దాదాపు 100 పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్‌ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్‌ చేశాయి. 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 2018–19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 35.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2017–18లో 21.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.  ఈ క్ర‌మంలో వీటికి ఊత‌మిచ్చేలా ట్రంప్‌-మోడీల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర ఒప్పందాలు, అంగీకారాలు ముఖ్య‌మ‌ని కోరుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: