చంద్రబాబునాయుడుకు సొంత నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్ధితి ఎదురవుతోంది. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు రెండు రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తలు మొదలయ్యాయి. ఉద్రిక్తతలు ఎందుకయ్యా అంటే ఫ్లెక్సీల ఏర్పాటుపై. అంటే చంద్రబాబు టూర్ సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని టిడిపి నేతలను ప్రయత్నిస్తే ఎక్కడా అవకాశం కనబడకపోవటమే సమస్యకు ప్రధాన కారణమైంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు రాకసందర్భంగా నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేద్దామంటే అవకాశమే దొరకలేదు. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రధానంగా కుప్పం టౌన్లో ఎక్కడ చూసినా  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్లెక్సీలతోనే నిండిపోయింది. కారణం ఏమిటంటే వారం క్రితం కుప్పంలో పెద్దిరెడ్డి పర్యటించారు. ఈయన రాక సందర్భంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

 

మంత్రి పర్యటన అయిపోయినా వైసిపి నేతలు ఫ్లెక్సీలను మాత్రం అలాగే ఉంచేశారు. వాటిని తీస్తే కానీ చంద్రబాబు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే అవకాశం లేదు. దాంతో మంత్రి ఫ్లెక్సీలను తీసేయాలని టిడిపి నేతలు ప్రయత్నించినపుడు వైసిపి నేతలు అడ్డుకున్నారు. దాంతో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇటువంటి ఉద్రిక్త పరిస్ధితులు ఒక్కచోట కాదు. మొత్తం టౌన్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్ధితి.

 

అంటే ఫ్లెక్సీలు తీయమంటే వైసిపి నేతలకు కోపం. తీయకపోతే టిడిపి నేతలు మండిపోతున్నారు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు. నిజానికి మంత్రి పర్యటన అయిపోయిన తర్వాత ఫ్లెక్సీలు తీసేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ఎందుకనో ఆ ఫ్లెక్సీలను వైసిపి నేతలు అలాగే ఉంచేశారు. ఇంతలో చంద్రబాబు పర్యటన ఫైనల్ అవటంతో గొడవ మొదలైంది. మరి ఫ్లెక్సీల రగడను అధికారులు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే. చంద్రబాబు రాకముందే గొడవ ఇలాగుంటే వచ్చిన తర్వాత ఇంకే మలుపు తీసుకుంటుందో  ?

మరింత సమాచారం తెలుసుకోండి: