అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలలో ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. విదేశీ వ్యవహారాల శాఖ ట్రంప్ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈరోజు ఉదయం 11.40 గంటలకు అహ్మదాబాద్ విమానశ్రయానికి ట్రంప్ చేరుకోనున్నారు. అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని మధ్యాహ్నం 12.15 గంటలకు ట్రంప్ సందర్శిస్తారు. 
 
మొతెరా స్టేడియంలో మధ్యాహ్నం 1.05 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటారు. సాయంత్రం 3.30 గంటల సమయంలో ఆగ్రాకు బయలుదేరి 4.45 గంటలకు ఆగ్రాకు చేరుకుంటారు. తాజ్ మహల్ ను సాయంత్రం 5.15 గంటలకు సందర్శిస్తారు. సాయంత్రం 6.45 కు ఢిల్లీకి బయలుదేరి 7.30కు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని హోటల్ మౌర్యలో ట్రంప్ బస చేయనున్నారు. 
 
అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు గత కొద్ది రోజుల నుండి భద్రతాకారణాల దృష్ట్యా ఈ హోటల్ ను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. రేపు ట్రంప్ రాష్ట్రపతి భవన్ లో స్వాగత కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ తరువాత 10.30 గంటలకు రాజ్ ఘాట్ లోని మహాత్మగాంధీ సమాధి దగ్గర నివాళులు అర్పించనున్నారు. హైదరాబాద్ హౌస్ లో రేపు ఉదయం మోదీ, ట్రంప్ మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. 
 
రేపు మధ్యాహ్నం 12.40 గంటలకు మీడియా సమావేశంతో పాటు ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. రేపు సాయంత్రం 7.30 గంటలకు ట్రంప్ రాష్ట్రపతి భవన్ లో రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు. రాత్రి 10 గంటలకు అమెరికాకు తిరుగు ప్రయాణం కానున్నారు. ట్రంప్ కు మోదీతో పాటు మంత్రులు, ఇతరులు ఘన స్వాగతం పలకనున్నారు. మొతెరా రోడ్ షో అనుకున్న సమయానికి ప్రారంభం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: