అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో రెండు రోజుల పర్యటన కోసం వైట్ హౌస్ నుంచి బయలుదేరారు. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తోన్న సంద‌ర్భంగా ఆయ‌న హిందీలో సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఇక త‌న భార్య అయిన అమెరికా తొలి మ‌హిళ మెలానియాతో కలిసి తొలుత హెలీకాఫ్టర్‌లో శ్వేతసౌధం నుంచి వాషింగ్టన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఇండియాకు బయలుదేరారు.

 

యూరోప్‌లోని జర్మని మీదుగా డొనాల్డ్ ట్రంప్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి నేరుగా చేరుకోనున్నారు. ట్రంప్ అహ్మ‌దాబాద్ విమానాశ్ర‌యానికి వ‌చ్చే సరికే సుమారు 12 గంట‌లు అవుతుంది. అక్క‌డ నుంచి ఆయ‌న 22 కిలోమీట‌ర్ల పాటు ర్యాలీగా అహ్మ‌దాబాద్‌లోని మోతేరాలో ఉన్న స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్క‌డ ఆయ‌న ప్ర‌ధాన మంత్రి మోడీతో క‌లిసి ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాను ప్రారంభించిన అనంతరం అక్కడే అధికారిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక ట్రంప్‌తో పాటు ప‌లువురు భార‌త ప‌ర్య‌టన‌కు వ‌స్తున్నారు. వారి జాబితా ఇలా ఉంది. ఇండియాలో అమెరికా రాయబారి కెన్ జుస్టర్ - అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి విల్బర్ రోస్ -ఇంధన శాఖ కార్యదర్శి డాన్ బ్రోలిట్ - ట్రంప్ తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్  మిక్ ముల్ వనే - అమెరికా జాతీయ భద్రతా సలహాదారు  ఇవాంకా ట్రంప్ - ట్రంప్ సహాయకుడు, సీనియర్ సలహాదారు జరేడ్ కుష్నర్ - సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ కూడా ఈ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు.

 

వీరితో పాటు డిజిటల్ మీడియా స్ట్రాటజిస్ట్ డాన్ స్కేవినో - ఫస్ట్ లేడీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లిండ్సే రేనోల్డ్స్ - స్పెషల్ రిప్రజెంటేటీవ్ ఫర్ టెలికమ్యునికేషన్ పాలసీ రాబర్ట్ బ్లెయిర్ - ప్రెస్ సెక్రెటరీ అండ్ ఫస్ట్ లేడీ కమ్యునికేషన్స్ డైరెక్టర్ స్టీఫెన్ గ్రీషం త‌దిత‌రులు కూడా ఈ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: