అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 11.40 గంటలకు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీ ట్రంప్ కు, ట్రంప్ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అహ్మదాబాద్ విమానశ్రయం నుండి ట్రంప్ సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అమెరికా - భారత్ జాతీయ జెండాలతో సబర్మతీ ఆశ్రమానికి వెళ్లే దారిలో ప్రజలు ట్రంప్ కు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ కంటే ముందే మోదీ సబర్మతి ఆశ్రమానికి చేరుకుని ట్రంప్ కు శాలువా కప్పి మరోసారి స్వాగతం పలికారు. 
 
ట్రంప్ సబర్మతీ ఆశ్రమంలో మోదీతో కలిసి మహాత్మ గాంధీ చిత్ర పటానికి వస్త్ర మాలను వేశారు. మోదీ గాంధీ సిద్ధాంతాల గురించి ట్రంప్ కు వివరించారు. ఆ తరువాత ట్రంప్ చరఖా తిప్పారు. సందర్శకులు పుస్తకంలో ట్రంప్ అతని భార్య మెలానియా తమ సందేశాన్ని రాసి సంతకాలు పెట్టారు. ట్రంప్ సబర్మతీ ఆశ్రమంలో " గొప్ప స్నేహితుడైన మోదీకి కృతజ్ఞతలు.. అద్భుతమైన సందర్శన సబర్మతీ ఆశ్రమం" అని రాసుకొచ్చారు. 
 
సబర్మతీ ఆశ్రమానికి మోదీతో పాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు. ట్రంప్ దంపతులు సబర్మతీ ఆశ్రమంలో ఉన్న మూడు కోతుల బొమ్మలను చూసి ముచ్చటపడ్డారు. మొతెరా స్టేడియానికి ట్రంప్ పర్యటన కోసం లక్షల సంఖ్యలో జనాలు హాజరయ్యారు. సబర్మతీ ఆశ్రమం నుండి ట్రంప్ మొతెరా స్టేడియానికి పయనమయ్యారు. సబర్మతీ ఆశ్రమం నుండి మొతెరా స్టేడియానికి పయనమైన ట్రంప్ కు ప్రజలు నీరాజనం పలికారు. 
 
సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఆశ్రమంలో గాంధీ మహాత్ముడు తన భార్యతో కలిసి 12 సంవత్సరాలు నివాసం ఉన్నారు. ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్రలాంటి కీలక ఘట్టాలు సబర్మతీ ఆశ్రమం నుండే ప్రారంభమయ్యాయి.ట్రంప్ పర్యటనలో ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొతెరా స్టేడియంలో జరగనున్న నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ తో పాటు ఇవాంకా కూడా పాల్గొంటున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: