భారత్ ఆతిధ్యానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ థ్రిల్ అయిపోయారు. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ట్రంప్ కుటుంబం మధ్యాహ్నం మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ముందుగా ఓ 20 నిముషాల పాటు నరేంద్రమోడి ప్రసంగించిన తర్వాత ట్రంప్ మాట్లాడారు. తన ప్రసంగం మొదట్లోనే  నమస్తే ఇండియా అంటూ అభివాదం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 

నరేంద్రమోడి తన కుటుంబానికి ఇచ్చిన ఆతిధ్యానికి తామంతా థ్రిల్ అయిపోయినట్లు చెప్పారు. ఆతిథ్యం ఇచ్చిన విధానాన్ని తాము గుండెల్లో దాచుకుంటామంటూ పొంగిపోయారు. మామూలుగా అమెరికాలో కానీ ఇంకే దేశంలో అయినా కానీండి రాజకీయ సభలకు ఇంత జనాలు రారన్న విషయం అందిరికీ తెలిసిందే. అమెరికాలో ట్రంప్ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కూడా ఇంతమంది జనాలను చూసుండరు. అలాంటిది మొతేరా క్రికేట్  స్టేడియంలో దాదాపు లక్షమందిని ఒక్కసారిగా అది తన ప్రసంగం వినటానికి హాజరయ్యారంటేనే ట్రంప్ థ్రిల్ కాకుండా మరేమవుతారు. ఇందుకే మోడిని ట్రంప్ ఒకటికి పదిసార్లు అభినందించింది.

 

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను తనతో ప్రారంభింపచేసినందుకు మోడీకి ట్రంప్ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సరే భవిష్యత్తులో ఎదిగేందుకు భారత్ కున్న అవకాశాలను పొగిడారు లేండి.  తమకు భారత్ లాంటి దేశం మిత్రదేశంగా ఉన్నందుకు అమెరికా రుణపడి ఉంటుందని చెప్పారు. పనిలో పనిగా ఎలాగూ క్రికెట్ స్టేడియమే కాబట్టి సచిన్ తెండుల్కర్, విరాట్ కొహ్లీ పేర్లను కూడా ప్రస్తావించారు. అలాగే దేశంలో ముఖ్యంగా గుజరాతీయులకు హీరో అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కూడా అభినందించారు.

 

ప్రపంచం మొత్తం మీద మధ్య తరగతి జనాలు ఎక్కువగా ఉన్నది ఒక్క భారత్ లోనే అంటూ తన వ్యాపార విస్తరణ ఆలోచనలను కూడా బయటపెట్టారు. ప్రపంచ వాణిజ్య రంగంతో పాటు శాస్త్ర సాంకేతికరంగాల్లో కూడా భారత్  పుంజుకుంటోందన్నారు. ప్రపంచ సాంస్కృతిక రంగానికి వెలలేని భాగస్వామ్యం అందించినందుకు జనాలకు ధన్యవాదాలు చెప్పుకున్నారు.  మొత్తం మీద ట్రంప్ కూడా సుమారు 25 నిముషాలు మాట్లాడారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: