గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టుగా జనసేన విషయంలో బిజెపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు గా కనిపిస్తోంది. చాలా కాలం నుంచి ఏపీలో బలపడాలని చూస్తున్నా ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడం... పార్టీ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారి పోతుండడం ... కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏపీలో మాత్రం కనీసం ఒక్క సీటు కూడా సాధించలేని దుస్థితి ఉండడం ఆ పార్టీ అగ్ర నాయకులకు మింగుడుపడడంలేదు.  దీనికి తోడు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఏపీ అధ్యక్షుడే ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క అభ్యర్థి గెలవకపోవడమే కాకుండా మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.


 పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి కాస్త మెరుగు పరిచే నాయకుడి కోసం బిజెపి అధిష్టానం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. దీనికోసం సమర్ధుడైన నాయకుడు కోసం ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు అటువంటి నాయకుడు బిజెపికి కనిపించలేదు. దీంతో ఏపీలో ఇదే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న జనసేన పార్టీని దగ్గర చేసుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. పవన్ కు ఏపీలో బలమైన సామాజిక వర్గం అండ ఉంది. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అయినా పవన్ వ్యూహాత్మక తప్పిదాల కారణంగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు కే ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది.  భవిష్యత్తులో ఆ పార్టీ అధికారం చేపడుతుందని నమ్మకం కూడా ఎవరికీ లేదు. 


కానీ బిజెపి జనసేన కలిస్తే ఆ లోటును అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో జనసేన తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో బిజెపి అధ్యక్షుడు ను ఎంపిక చేసే బాధ్యత కూడా పవన్ కు బిజెపి అప్పగించినట్టు  తెలుస్తోంది. బిజెపి అధ్యక్ష స్థానం కోసం ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. విష్ణుకుమార్ రాజు, దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఇలా చాలా మంది నాయకులుఉన్నారు. అయితే వీరెవరికీ క్షేత్రస్థాయిలో అంతగా బలం లేదని అధిష్టానం నమ్ముతోంది. 


అది కాకుండా.. ప్రస్తుతం జనసేనతో పొత్తు పెట్టుకున్న కారణంగా అధ్యక్షుడు ఎంపిక కూడా పవన్ కు అప్పగిస్తే రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే విషయంలో ఎటువంటి విబేధాలు రావని,  కొత్త అధ్యక్షుడిని కూడా పవన్ ఎంపిక చేస్తారు కాబట్టి రెండు పార్టీల మధ్య సమన్వయం ఉంటుందని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: