రాజకీయాల్లో స్నేహాలు అవసరాల మేరకు ఉంటాయని మరోసారి టిడిపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో రుజువైంది. ఒకరి ఎదుగుదలను ఒకరు ఓర్చుకోకుండా సొంత పార్టీ నాయకులు ఏదైనా వివాదంలో చిక్కుకుంటే ప్రత్యర్థులకంటే వీరే ఎక్కువ సంతోషంలో మునిగితేలుతుంటారు. ఇదంతా రాజకీయాల్లో సర్వ సాధారణ వ్యవహారంగానే కనిపిస్తోంది. తాజాగా ఈ ఎస్ ఐ కుంభకోణంలో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు బయటపడడం, ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్ననాయుడు నిండా మునిగినట్టుగా కనిపిస్తుండడంతో తెలుగుదేశం అగ్ర నాయకుల్లో సైతం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు  చంద్రబాబు తర్వాత ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్నారు.


 అసెంబ్లీలోనూ బయట అధికార పార్టీని ఎదుర్కుంటూ పార్టీకి అండగా నిలబడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కీలక నాయకుడిగా ఉన్నారు. అచ్చెన్నాయుడు దివంగత ఎర్రన్నాయుడు ఏ విధంగా అయితే టీడీపీకి అండగా నిలబడి ఆ పార్టీ తరపున పోరాడుతూ వచ్చారో అదే విధంగా కూడా ప్రస్తుతం టిడిపికి అండగా నిలబడుతున్నారు. ఉత్తరాంధ్ర లో అతిపెద్ద రాజకీయ కుటుంబంగా కింజారపు ఫ్యామిలీ గుర్తింపు పొందింది. అచ్చెన్న ఎమ్యెల్యేగా, రామ్మోహన్ నాయుడు ఎంపీగా  ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ విధంగా ఉత్తరాంధ్ర లో అతిపెద్ద రాజకీయ కుటుంబం గా ఉంది. కానీ ప్రస్తుతం ఈ ఎస్ ఐ కుంభకోణంలో అచ్చెన్న చిక్కుకుని ఉండడంతో ఆయనకు మద్దతుగా మాట్లాడేందుకు ఆ ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తు టిడిపి ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అదే జిల్లాకు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు ఈ విషయం గురించి పెద్దగా నోరు మెదపలేదు. 


ఇక పక్క జిల్లా విజయనగరానికి వస్తే అక్కడ మాజీ మత్రి సుజయ కృష్ణ రంగారావు కానీ, విశాఖ జిల్లా కీలక నేత గంటా శ్రీనివాసరావు కానీ, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గాని, ఇలా ఎవరు ఆయనకు మద్దతుగా నిలబడేందుకు ఇప్పటి వరకు ముందుకు రాకపోవడం పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే విషయం పై అచ్చెన్న తన సన్నిహితుల వద్ద కూడా తన బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగతా ప్రాంతాల వారు మాత్రమే కాస్తోకూస్తో నోరు మెదుపుతున్నా ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులు మాత్రం నోరు మెదపడం లేదు. దీనికి కారణం త్వరలో అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారనే సమాచారంతో కొంతమంది నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు అచ్చెన్న అనుమానిస్తున్నారు.


 ఇప్పుడు ఈ కుంభకోణంలో నిండా మునిగినట్టు కనిపిస్తుండడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం నాయకులు ఇదంతా తమకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితిని చూసి అచ్చెన్న చాలా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: