మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భారీ టార్గెట్టే పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో బిఎస్పి, వామపక్షాలతో పొత్తులు పెట్టుకున్నా ఏ విధమైన ఉపయోగం కనబడలేదు. దాంతో వాళ్ళతో పొత్తులు తెంచేసుకోకుండానే బిజెపిని లైన్లో పెట్టారు. మొత్తానికి ఇది వర్కవుటవటంతో  భేషరతుగా కమలంపార్టీతో పొత్తు పెట్టేసుకున్నాడు.

 

దాంతో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అసలైన ప్రతిపక్షంగా బిజెపి+జనసేన కూటమే గట్టిగా నిలుస్తుందని పవన్ అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తక్కువలో తక్కువ 50 సీట్లలో పార్టీ గెలవాలని గట్టిగా అనుకున్నాడట. అంటే ఎన్ని సీట్లలో పోటి చేయాలనే విషయం మాత్రం ఇపుడే నిర్ణయం అవ్వదు కదండి. అందుకనే ముందుగా గెలవాల్సిన సీట్ల టార్గెట్ ను మాత్రం ఫిక్స్ చేసుకున్నాడట. విచిత్రంగా ఉందా ? పవన్ ఆలోచనలన్నీ విచిత్రంగానే ఉంటాయి లేండి.

 

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు  వచ్చే ఎన్నికల వరకూ రెండు పార్టీలు కలిసుంటాయా అని అడిగితే రెండు పార్టీల నేతలూ సరైన సమాధానం చెప్పలేకున్నారు. పవన్  ఏరోజైనా సరే చంద్రబాబునాయుడు చంకనెక్కేస్తాడనే అనుమానం బిజెపి నేతల్లో చాలా బలంగా ఉంది. అదే సమయంలో జగన్ ను ఎన్డీఏలో చేరమని స్వయంగా నరేంద్రమోడినే ఆహ్వానించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కారణంతోనే వైసిపి ఎన్డీఏలో చేరితే తాను బయటకు వచ్చేస్తానంటూ  తొందరపడి ఇచ్చిన ప్రకటనతో పవన్ స్ధిరత్వంపై అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

 

సరే ఎవరి ఆలోచనలు, టార్గెట్లు ఎలాగున్నా సంక్షేమ పథకాల అమలుతో జగన్ మాత్రం జనాల్లో బాగా దూసుకుపోతున్నారు. జనసేనకు ఇంత వరకూ నలుగురు నేతలు కూడా లేరు చెప్పుకోవటానికి. పార్టీ పెట్టి ఏడేళ్ళయినా పార్టీ కార్యవర్గం కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్ధితిలో ఉన్నాడు పవన్. ఇటువంటి పవన్ రాబోయే ఎన్నికల్లో 50 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాడంటే ఎలా సాధ్యమో పవనే చెప్పాలి.

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: