అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్ అనేక దేశాలలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా ఆయ‌న విచ్చేశారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్‌తోపాటు అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ట్రంప్ సోమ‌వారం భారత్‌కు వ‌చ్చారు. ట్రంప్‌కు స్వాగతం పలికే హోర్డింగ్‌లతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగర వీధులన్నీ నిండిపోయాయి. అయితే, ఇక్క‌డే బీజేపీ సీఎంకు అవ‌మానం జ‌రిగింద‌ని అంటున్నారు. 

 

గత ఏడాది అమెరికాలో జరిగిన ‘హౌడీ మౌదీ’ వేడుకలో ట్రంప్‌, మోదీ కరచాలనం తదితర ఫొటోలతో కూడిన హోర్డింగ్‌లు 22 కి.మీ. పొడవునా ఏర్పాటు చేశారు. అహ్మ‌దాబాద్‌లో... ‘ఉజ్వల భవిష్యత్‌ కోసం బలమైన స్నేహం’ అనే సందేశంతో కూడిన హోర్డింగ్‌లు అడుగడుగునా దర్శనమిచ్చాయి. అయితే గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఫొటో ఎక్కడా కనిపించకపోవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 


ట్రంప్ ఇండియా టూర్‌పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ ఘాటుగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన పట్ల భారత్‌కు పెద్దగా ఒరిగేదేమీ లేదని, ఎలాంటి సానుకూల సంకేతాలు లేవని విమర్శించారు. ‘ట్రంప్‌ పర్యటన వల్ల భారత్‌కు ఒనగూరే ప్రయోజనాలపై ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల సంకేతాలు కనిపించలేదు. రక్షణ, భద్రతా పరంగా సహకారం కొనసాగే అవకాశముంది. అంతరిక్షం, నూక్లియర్‌ సైన్స్‌లోనూ మన సహకారం కొనసాగుతుంది. ఒక్క హెలికాప్టర్ల ఒప్పందం తప్ప కొత్తగా ఏమీ ఉండబోదు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా చేస్తున్న ప్రతికూల వ్యాఖ్యల ద్వారా వాణిజ్య ఒప్పందం లేదా జీఎస్పీ పునరుద్ధరణ జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ  ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్‌' అని నినదిస్తుంటే.. ‘భారత్‌ ఫస్ట్‌'పై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో 85 వేల హెచ్‌1బీ వీసాల్లో భారతీయ ఐటీ నిపుణులు 70 శాతం పొందేవారని, ప్రస్తుతం అమెరికా వలస విధానంలో ఆంక్షల వల్ల 2015లో 6 శాతం వీసా దరఖాస్తులు తిరస్కరణ కాగా 2019 నాటికి అది 24 శాతానికి చేరిందన్నారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో అమెరికా నుంచి చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకునే అవకాశమున్నదా అని ప్రశ్నించారు. 3 బిలియన్‌ అమెరికా డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను అమెరికాతో భారత్‌ చేసుకుంటుండగా, భారత్‌ ఉక్కు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు ఎందుకని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: