ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్...ప్రజలని మోసం చేస్తూ పాలన చేస్తున్నారని, అన్నిటిని రద్దు చేసుకుంటూ వెళుతున్నారని, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 19న ప్రకాశం జిల్లా పర్చూరు వేదికగా యాత్ర ప్రారంభించి, ఎప్పటిలాగానే బోరింగ్ స్పీచ్ ఇచ్చి, ప్రజలకు బోరు కొట్టించారు. భారీ సంఖ్యలో ప్రజలు వచ్చిన, చంద్రబాబు మాత్రం జగన్‌ని తిట్టడానికే ప్రాధాన్యత ఇచ్చారు.

 

మొదటిరోజు పాదయాత్ర తర్వాత నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ సోమవారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో యాత్ర చేశారు. అయితే ఈ యాత్రకు ప్రజల నుంచి ఊహించిన స్పందన రాలేదు. పర్చూరులో వచ్చినంత జనం ఇక్కడ రాలేదు. అసలు బాబు కంచుకోట కుప్పంలో ఇంత దారుణంగా జనం రావడమనేది చాలా షాకింగ్ కలిగించే విషయం. అయితే ఈ స్థాయిలో కుప్పంలో బాబు యాత్రకు ఇంత నెగిటివ్ స్పందన రావడానికి కారణాలు చాలానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

 

జగన్ మూడు రాజధానులు ప్రకటించాక కుప్పంలో కూడా పరిస్థితులు మారిపోయినట్లు తెలుస్తోంది. పైగా ఇటీవల కుప్పం పక్కనే ఉన్న బాబు సొంతవూరు చంద్రగిరిలోని నారావారిపల్లేలో మూడు రాజధానులకు మద్ధతుగా సభ పెడితే, ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. దీనికి తోడు చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా చేయలేని పనిని జగన్ పూర్తి చేశారు. అభివృద్ధిలో భాగంగా కుప్పం పంచాయితీని మున్సిపాలిటీగా మార్చారు. ఇది ఓ రకంగా కుప్పం ప్రజలకు వరమే అని చెప్పొచ్చు.

 

అదేవిధంగా కుప్పం వైసీపీ ఇన్ చార్జ్ చంద్రమౌళి తనయుడు భరత్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కుప్పం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇలా వైసీపీ ప్రభుత్వం కుప్పం అభివృద్ధి కోసం పాటుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు వచ్చి జగన్ పాలన బాగోలేదంటే, అక్కడ ప్రజల నుంచి ఇంకా ఏం స్పందన వస్తుంది. అందుకే కుప్పంలో ఊహించని విధంగా బాబుకు షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: