తొలిసారి అధికార పీఠం ఎక్కిన జగన్ చాలా వ్యూహాత్మకంగా పాలన చేస్తున్నట్లు కనబడుతుంది. తాను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఓ గట్టి వ్యూహమే ఉంటుందని అర్ధమవుతుంది. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా ఆయన అన్నీ వర్గాలని తన వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన యువతనే టార్గెట్ చేసుకుని పాలన కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

 

అసలు అధికారంలోకి వచ్చినప్పుడే జగన్ తాను 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండేలా పాలన చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్‌కు 46 సంవత్సరాలు కాబట్టి ఆయనకు ఆ అవకాశం పుష్కలంగా ఉంది. కాకపోతే ఆ స్థాయిలో సీఎంగా నిలబడాలంటే యువత అవసరం చాలా ఉంది. వారిదే భవిష్యత్ కాబట్టి, ఇప్పటి నుంచి వారి భవిష్యత్ పట్టించుకుంటే రాబోయే రోజుల్లో తన భవిష్యత్ కూడా బాగుంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే అధికారంలో రాగానే ఏపీలో ఎప్పుడు లేని విధంగా నిరుద్యోగ యువతకు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు.

 

యువకులకు సొంత ఊరిలోనే ఉద్యోగం, కనీస ఉద్యోగ భద్రత కల్పించేలా గ్రామ సచివాలయాన్ని తీసుకొచ్చారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చారు. ఇక తాజాగా యువత చదువుకోవడానికి జగన్న విద్యా దీవెన పేరిట ఫీజు రీఎంబర్స్‌మెంట్ అందిస్తున్నారు. పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ‘అమ్మ ఒడి’ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుండగా.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకూ చేయూత అందించేందుకు ‘జగనన్న వసతి దీవెన’ పథకం తీసుకొచ్చారు.

 

పథకం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున హాస్టల్, మెస్‌ చార్జీల కింద చెల్లిస్తారు. దాదాపు 11 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు.  ఈ విధంగా అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే జగన్ యువతకు అండగా నిలుస్తూ, రానున్న రోజుల్లో వారి అండ వైసీపీకి దక్కేలా చేసుకొనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: