ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ముగ్గురు నానీలు ఉండటం తెలిసిన విషయమే అయినా, అలా ముగ్గురు మంత్రులు పేర్లు నానీలే కావడం కాస్త ఆశ్చర్యకరం కలిగించే విషయం. పైగా ఈ ముగ్గురు నానీలు తొలిసారే మంత్రులు కావడం, వారి నియోజకవర్గాలు కూడా దగ్గరగానే ఉండటం, ముగ్గురు జగన్ కోసం ఎమ్మెల్యే పదవులు పోగొట్టుకోవడం మరింత అరుదైన విషయం. అలా జగన్ కోసం పదవులు చేసిన నానీలు ఎవరో కాదు. ఒకరు మచిలీపట్నంకు చెందిన పేర్ని వెంకట్రామయ్య(నాని), మరొకరు ఆ పక్కనే ఉండే గుడివాడకు చెందిన కొడాలి వెంకటేశ్వరరావు(నాని). ఇక ఇటు గుడివాడకు దగ్గరలో ఉండే ఏలూరుకు చెందిన ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని).

 

పేర్ని నాని మచిలీపట్నం నుంచి 2004, 2009లలో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత జగన్ కోసం, 2012 ఉప ఎన్నికలు అయిపోయాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చి, 2014లో పోటీ చేసి ఓడిపోయి, 2019లో మళ్ళీ గెలిచి జగన్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. అటు కొడాలి నాని 2004, 2009లలో గుడివాడ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచి, జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని వదిలేసి వైసీపీలోకి వచ్చేశారు. ఇక 2014లో వైసీపీ నుంచి గెలిచి ప్రతిపక్షంలోనే ఉండి, మళ్ళీ 2019లో పోటీ చేసి విజయం సాధించి, మంత్రి అయ్యారు.

 

అటు పేర్ని నాని మాదిరిగానే ఆళ్ళ నాని కూడా ఏలూరు నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి, తర్వాత పదవికి రాజీనామా చేసి, 2014లో ఓడిపోయి, 2019 లో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ విధంగా మంత్రి పదవులు దక్కించుకున్న ముగ్గురు నానీల్లో, పేర్ని నాని, కొడాలి నాని మంచి పనితీరే కనబరుస్తున్నారని వైసీపీ అంతర్గత చర్చల్లో టాక్ నడుస్తుంది.

 

అయితే వీరి మీద పోలిస్తే ఆళ్ళ నాని ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పైగా ఆళ్ళ నానిపై సొంత జిల్లా వెస్ట్ గోదావరిలోని వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన జిల్లాపై పెత్తనం చేస్తూ, ఎవరని పట్టించుకోవడంలేదని ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే మిగతా ఇద్దరితో పోలిస్తే ఆళ్ళ నాని కాస్త వెనుకపడే ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: