గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో బాగా హైలైట్ అవుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావునే. పర్చూరు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏలూరి...ప్రతిపక్షంలో తనదైన శైలిలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు. ఇక మొన్న చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ప్రారంభ రోజుని సూపర్ హిట్ అయ్యేలా చేసింది ఏలూరినే. జగన్ ప్రభుత్వం యొక్క ప్రజావ్యతిరేక నిర్ణయాలని ఎండగట్టేందుకు చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

 

ఇక ఆ యాత్రని ఏలూరి సొంత నియోజకవర్గం పర్చూరులోనే మొదలుపెట్టారు. దీంతో యాత్రని విజయవంతం చేసే బాధ్యత ఏలూరి తీసుకుని, ఊహించని రేంజ్‌లో యాత్రని సక్సెస్ చేశారు. దీంతో అప్పుడు వార్తల్లో బాగా నిలిచిన ఏలూరి...తాజాగా కూడా దేశంలో యువ ఆదర్శ ఎమ్మెల్యే అవార్డు తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయ్యాడు. అసలు దక్షిణ భారతదేశం నుంచి అవార్డు తీసుకున్న ఏకైక ఎమ్మెల్యే ఏలూరినే. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, సేవకు గాను ఏలూరికి ఆ అవార్డ్ వచ్చింది.

 

2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏలూరి...నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలని పరిష్కరించి, ప్రజల మనసు గెలుచుకుని, మళ్ళీ 2019 లో దగ్గుబాటి లాంటి దిగ్గజ నేతని ఓడించి, విజయం సాధించగలిగారు. కాకపోతే పార్టీ ప్రతిపక్షంలోకి రావడంతో, కాస్త పరిస్తితులు మారాయి. అయితే ఏలూరి మంచి సత్తా ఉన్న నాయకుడు కావడంతో ఆయనని వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. వల్లభనేని వంశీ పార్టీ మారే సమయంలో మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుకు షాక్ ఇస్తారని, అందులో ఏలూరి కూడా ఉన్నారని ప్రచారం వచ్చింది.

 

అది కూడా తన సామాజికవర్గానికి చెందిన మంత్రి కొడాలి నాని...ఏలూరితో టచ్‌లోకి వెళ్ళి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఏలూరి లాంటి నేత పార్టీలోకి వస్తే పర్చూరులో మరింత  బలపడొచ్చని ఆలోచన చేశారని తెలిసింది. కానీ ఏలూరికు అలాంటి ఆలోచనే లేదని వెంటనే తెలిసిపోయింది. అసలు టీడీపీని వీడే ప్రసక్తే లేదని, తాను చంద్రబాబు శిష్యుడేనని ఏలూరి మొన్న ప్రజా చైతన్య యాత్రలో నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: