అమరావతి ఉద్యమం రోజురోజుకూ చల్లారిపోతోంది. ఏవో ఒకటి, రెండు టీడీపీ అనుకూల మీడియాలు తప్పమిగిలిన వారు ఎవరూ ఆ ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు. టీడీపీ అనుకూల మీడియా ఎంత ప్రయత్నించినా ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం లేదు. ఈ సమయంలో తాజాగా వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి జరిగింది.

 

గతంలోనూ వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజినిలపై దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల వెనుక అసలు వ్యూహం రాజధాని ప్రాంతంలో టీడీపీ ఉనికిని కాపాడుకోవడమేనట. టీడీపీ ఉనికి కాపాడుకోవడానికే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై రైతుల ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కిలారి రోశయ్య విమర్శించారు.

 

రాజధాని ప్రాంతంలో మహిళలను ముందుపెట్టి టీడీపీ గుండాలు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేయడాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య తీవ్రంగా ఖండించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసం, భూముల విలువలు తగ్గిపోతాయన్న బాధతోనే.. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు వసూళ్లు చేసి మరీ రాజధాని పేరుతో దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆరోపించారు.

 

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు, వారి అనుకూల మీడియా రోజుకోరకంగా తప్పుడు ప్రచారం చేస్తూ కుయుక్తులు పన్నుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని ఆయన అన్నారు.

 

గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజినిలపైనా దాడులు చేశారని ఇప్పుడు నందిగం సురేష్‌లపై దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా భావిస్తున్నామంటూ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ప్రజలే టీడీపీ నేతలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మరి ఈ దాడుల రాజకీయం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: