‘ద గ్లోబల్‌ టాలెంట్‌ స్కీమ్‌' పేరుతో బ్రిటన్‌ నూతనంగా రూపొందించిన కొత్త వలస విధానంపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ సరికొత్త వలస విధానాన్ని ప్రకటించింది. నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతించేలా ‘పాయింట్ల ఆధారిత వీసా’ విధానాన్ని రూపొందించింది. బ్రిటన్‌ హోంమంత్రి, ప్రవాస భారతీయురాలు ప్రీతీపటేల్‌ ఈ విధానాన్ని వివరించారు. కొత్త విధానం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అయితే, ఆదిలోనే ఈ విధానంపై వివిధ రకాలైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 


కొత్త టాలెంట్‌ విధానం ప్రకారం విద్యార్హతలు, నైపుణ్యాలు వంటివాటిని లెక్కించి పాయింట్లు కేటాయిస్తారు. విదేశీయులు కచ్చితంగా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. కంపెనీ నియామక పత్రం ఉండాలి. ఈ రెండింటికీ కలిపి 50 పాయింట్లు ఇస్తారు. విద్యార్హతలు, అదనపు నైపుణ్యాలు, జీతభత్యాలు, వృత్తి వంటివాటి ఆధారంగా అదనపు పాయింట్లు కేటాయిస్తారు. కనీసం 70 పాయింట్లు సాధించినవారికి మాత్రమే వీసా మంజూరు చేస్తారు. కనీస వార్షిక వేతనాన్ని 25,600 పౌండ్లుగా (రూ.23.75 లక్షలు) నిర్ధారించారు. గతంలో ఇది 30వేల పౌండ్లుగా (రూ.27.85 లక్షలు) ఉండేది. ప్రస్తుతం డిగ్రీ చదివినవారు కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, నూతన విధానం ప్రకారం కనీసం పీజీ లేదా సత్సమానమైన అర్హత కలిగి ఉండాలి. 

 

ప్రీతీపటేల్ ఈ బిల్లు గురించి స్పందిస్తూ...ఇది ప్రపంచానికే చారిత్రాత్మకమైన రోజు. బ్రిటన్‌లోకి ఇష్టారీతిన వచ్చివెళ్లే విధానానికి అంతం పలుకుతున్నాం. మా సరిహద్దులను మా ఆధీనంలోకి తీసుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు పాయింట్ల ఆధారిత వలస విధానాన్ని ప్రకటిస్తున్నాం. తద్వారా వలసదారులు తగ్గడంతోపాటు ప్రతిభ ఉన్నవారు, నైపుణ్యం కలిగినవారే బ్రిటన్‌కు వస్తారు’ అని ప్రీతీ పటేల్‌ పేర్కొన్నారు. నూతన వలస విధాన బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉన్నదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: