వివాదాస్పద ఐఆర్ఎస్ అధికారి, చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ విషయం జగన్మోహన్ రెడ్డికి క్యాట్ పెద్ద షాక్ ఇచ్చింది. అవినీతి, అక్రమాల ఆరోపణలపై జాస్తిని ప్రభుత్వం  సస్పెండ్ చేయటాన్ని క్యాట్ తప్పు పట్టింది.  జాస్తి సస్పెన్షన్ చెల్లదని చెబుతునే డిప్యుటేషన్ రద్దు చేసుకుని జాస్తి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళ వచ్చని కూడా స్పష్టంగా చెప్పింది. కాకపోతే ఆయనపై ఉన్న ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని చెప్పటమొకటే జగన్ ప్రభుత్వానికి ఊరట.

 

చంద్రబాబునాయుడు హయాంలో ఏపి ఆర్ధిక అభివృద్ధి మండలి సీఈవోగా జాస్తి పనిచేశారు. చంద్రబాబు హయాంలో జాస్తి అధికారాలకు ఆకాశమే హద్దుగా ఉండేది. దాంతో తనిష్టం వచ్చినట్లుగా ఆర్ధిక అభివృద్ధి మండలిలో కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే  సిఎంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి  ఎటువంటి ఆరోపణను కూడా పట్టించుకోలేదు.  కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయని అప్పట్లో వైసిపి నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా లెక్క చేయలేదు.

 

సీన్ కట్ చేస్తే చంద్రబాబు మాడు పగులగొట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే  జాస్తి రాష్ట్ర సర్వీసు నుండి కేంద్రానికి వెళిపోతానంటూ దరఖాస్తు పెట్టుకున్నారు. దాన్ని జగన్ ప్రభుత్వం తిరస్కరించింది. పైగా వెంటనే సస్పెన్షన్ వేటు కూడా వేసి కేసు నమోదు చేసింది. ఒకటి కాదు రెండు కాదు జాస్తి పై చాలా ఆరోపణలే ఉన్నాయి.  చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాళ్ళలో చాలామందిని కాంట్రాక్టు పద్దతిలో సలహాదారులుగా నియమించుకున్నారు. వీళ్ళకు లక్షల్లో  జీతబత్యాలు ముట్టచెప్పారు.

 

అంతేనా,  చినబాబు నారా లోకేష్ దావోస్ పర్యటనకు సుమారు 4 కోట్ల రూపాయలు పెట్టి నిర్వాహకుల నుండి ఆహ్వనాన్ని కొనుగోలు చేశారు. దాని వల్ల ఫలితమేమిటంటే గుండుసున్నాయే. దావోస్ లో జరిగిన  ప్రపంచ ఆర్ధిక సదస్సులో తాను కూడా పాల్గొన్నట్లు లోకేష్ చెప్పుకోవటానికి తప్ప ఇంక దేనికీ పనికిరాదు ఆ పర్యటన. ఇటువంటి పద్దతుల్లో కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలున్నాయి జాస్తిపై. మరి ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం సస్పెన్షన్ ఎత్తేసి కేంద్ర సర్వీసుకు అనుమతిస్తారో లేదో చూడాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: