దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రోమారు క‌ల‌క‌లం రేగింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఈశాన్య ఢిల్లీలోని బ్ర‌హ్మ‌పురి ఏరియాలో సోమ‌వారం జ‌రిగిన హింస‌లో ఓ కానిస్టేబుల్‌తో స‌హా అయిదుగురు చ‌నిపోయారు. అయితే మృతుల సంఖ్య ఏడుకు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. దీనికి కొన‌సాగింపుగా ఇవాళ కూడా ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీనిపై ఇటు కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించాయి.

 

వ‌రుస‌గా మూడ‌వ రోజు కూడా అల్ల‌ర్లు చోటుచేసుకోవ‌డంతో...ఆ ప్రాంతాన్ని రాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ కూంబింగ్ చేస్తోంది. బ్ర‌హ్మ‌పురి ప్రాంతంలో గ‌స్తీ నిర్వ‌హిస్తున్న ఆర్ఏఎఫ్ ద‌ళాల‌కు  వాడిన బుల్లెట్లు ల‌భించాయి. జ‌ఫ్రాబాద్, సీలంపూర్‌లో మ‌హిళ‌లు ధ‌ర్నా కొన‌సాగిస్తున్నారు. అక్క‌డ ఆరు వారాల నుంచి వాళ్లు సీఏఏకు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నారు. రాళ్లు రువ్విన సంఘ‌ట‌నపై స్పందించారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ త‌మ ఎమ్మెల్యేల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ కూడా తెలిపారు. మ‌ధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీకానున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్  చెప్పారు. 

 

ఢిల్లీ శాంతిభ‌ద్ర‌త‌ల అంశంపై సీఎం కేజ్రీవాల్‌ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు . ఢిల్లీ ప్ర‌జ‌లు శాంతిని పాటించాల‌ని కోరారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో ఇవాళ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించిన అనంత‌రం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.  సీఏఏని వ్య‌తిరేకిస్తూ న‌గ‌రంలో జ‌రుగుతున్న అల్ల‌ర్ల ప‌ట్ల ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈశాన్య ఢిల్లీలో జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో అనేక మంది పోలీసులు గాయ‌ప‌డ్డార‌న్నారు. పౌరులు కూడా గాయ‌ప‌డ్డారు. ఇది దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని సీఎం కేజ్రీవాల్  ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌భావిత ప్రాంతాల్లో పోలీసుల సంఖ్యా బ‌లం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు కేజ్రీ తెలిపారు. అయితే ప్ర‌స్తుతం ఈశాన్య ఢిల్లీలో ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు డీపీసీ అమూల్య ప‌ట్నాయ‌క్ తెలిపారు. అయిదు పింక్ లైన్ మెట్రో స్టేష‌న్లను ఇవాళ కూడా మూసివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: