మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. సీఎం జగన్ కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ రాజకీయ నాయకుడు వైసీపీ పార్టీలో చేరబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2004 సంవత్సరం నుండి వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీ నుండి పోటీ చేస్తున్న సతీష్ కుమార్ రెడ్డి అతి త్వరలో వైసీపీ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. 
 
సతీష్ రెడ్డి వైసీపీలో చేరితే పులివెందులలో టీడీపీ ఖాళీ అయినట్లే అని చెప్పవచ్చు. దశాబ్దాల నుండి పులివెందులలో వైయస్ కుటుంబాన్ని మాత్రమే అక్కడి ప్రజలు గెలిపిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గం వైయస్ కుటుంబానికి కంచుకోట. పులివెందుల నియోజకవర్గ ప్రజలు "పులివెందుల గడ్డ... వైయస్ కుటుంబానికి అడ్డ" అని చెబుతారంటే పులివెందుల నియోజకవర్గ ప్రజల్లో వైయస్ కుటుంబంపై ఉండే ఆదరాభిమానాలు అర్థమవుతాయి. 
 
వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో వైయస్ కుటుంబం నుండి ఎవరు పోటీ చేసినా రికార్డు మెజారిటీతో గెలిచేవారు. వైయస్ కుటుంబంపై పోటీ చేసినా ఓటమి తథ్యం అని భావించి పోటీ చేయడానికి వెనకాడిన నేతలు కూడా ఉన్నారు. కానీ సతీష్ రెడ్డి మాత్రం ప్రతి ఎన్నికల్లో వైయస్ కుటుంబానికి సవాల్ విసురుతూ.. తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తూ వైయస్ కుటుంబంతో ఢీకొంటున్నారు. 
 
2004 నుండి టీడీపీ తరపున సతీష్ రెడ్డి పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో వైయస్ కుటుంబం చేతిలో ఓటమిపాలవుతున్నారు. దశాబ్దాలుగా టీడీపీ నుండి పోటీ చేస్తున్నా విజయం సాధించలేకపోతున్ననని వైసీపీలో చేరితే గుర్తింపుతో పాటు పదవులు దక్కే అవకాశం ఉందని భావించి సతీష్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అతి త్వరలో సతీష్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: