రాజకీయాల్లో కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉంటేనే మంచి విజయాలు దక్కుతాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ ఎమ్మెల్యే నిరూపించారు. 2014లో వైసీపీ తరుపున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ముస్తఫా స్వల్ప మెజారిటీ తేడాతో విజయం సాధించారు. అప్పుడు టీడీపీ అభ్యర్ధిగా ఉన్న మద్దాలి గిరిని ఓడించి, ఎమ్మెల్యే అయిపోయారు. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండటంతో, టీడీపీ తరుపున అభ్యర్ధి ముస్లిం కాకపోవడం ముస్తఫాకు బాగా కలిసొచ్చింది. ఎమ్మెల్యే అయిపోయారు.

 

అయితే ఎమ్మెల్యేగా గెలిచిన, తమ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయిన ముస్తఫా మాత్రం నియోజకవర్గంలో మంచిగానే పనులు చేయించుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న కొందరు టీడీపీ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో కావల్సిన పనులు అయ్యేలా చేసుకున్నారు. గుంటూరు ప్రధాన నగరం కావడంతో టీడీపీ ప్రభుత్వం కూడా అభివృద్ధి బాగానే చేసింది. అది ముస్తఫాకు ఇంకా బాగా కలిసొచ్చింది. ఇక అదే ఊపుతో 2019 ఎన్నికల్లో మరోసారి పోటి చేసి 23 వేల ఓట్ల పైనే మెజారిటీతో విజయం సాధించారు.

 

ఈసారి పార్టీ అధికారంలోకి రావడం ముస్తఫాకు ప్లస్ అయింది. నియోజకవర్గంలో బాగానే పనులు చూసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ హక్కు బిల్లుకు వ్యతిరేకంగా తన నియోజకవర్గంలో ఆందోళనలు చేస్తున్నారు. దీని వల్ల నియోజకవర్గంలో ఉన్న ముస్లింలు ఆయన పట్ల పాజిటివ్‌గా ఉన్నారు. అటు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు మద్ధతుగా ర్యాలీలు కూడా చేస్తున్నారు. అయితే అమరావతి దగ్గరే ఉండటం వల్ల, ఈ మూడు రాజధానుల పట్ల నియోజకవర్గ ప్రజలు అంత పాజిటివ్‌గా లేరు.

 

ఇక ఇవేగాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ ముందుకెళుతున్నారు. మొత్తం మీదైతే ముస్తఫా ప్రతిపక్ష టీడీపీ జోలికి పెద్దగా వెళ్లకుండా తన నియోజకవర్గానికే పరిమితమై పనులు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: