టెలికం సేవలు ఆరంభించి మూడున్నరేళ్లలోనే దేశంలో అతిపెద్ద సంస్థగా అవతరించి రిలయన్స్‌ జియో  ప్రభంజనం సృష్టించింది. నవంబర్‌ 2019 నాటికి 36.9 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులతో ఈ రికార్డును సాధించిందని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ వెల్లడించింది. అయితే, జియో కారణంగా ప్రధానంగా దెబ్బపడింది ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కేనని ఓ ప్రచారం ఉంది. కారణాలు ఏమైనా బీఎస్ఎన్ఎల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.69 వేల కోట్ల పునరుద్దరణ ప్యాకేజీ ప్రకటించింది. అయితే, ఈ విషయంలో మోదీ సర్కారు ఇబ్బందుల్లో పడే పరిస్థితి కనిపిస్తోంది. 

 


గత ఏడాది అక్టోబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఎంటీఎన్‌ఎల్‌ను విలీనం చేయడంతోపాటు రూ.68 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. వీటితోపాటు సావరిన్‌ గ్యారంటీ కింద ఇరు సంస్థలు రూ.15 వేల కోట్ల నిధులను దీర్ఘకాలిక బాండ్లను జారీ చేయడం ద్వారా సేకరించడానికి కూడా అనుమతినిచ్చింది. ఈ రిలీఫ్‌ ప్యాకేజీ అందకపోవడంతో సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని, వీఆర్‌ఎస్‌ కింద దాఖలు చేసుకున్న 78,569 మంది సిబ్బంది ఇప్పటికే విధులకు దూరమయ్యారని, వీరికి కూడా ఎలాంటి నిధులు చెల్లించలేదని  ఆల్‌ యూనియన్స్‌ అండ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌(ఏయూఏబీ)  వర్గాలు ఆరోపిస్తున్నారు.  ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి కేంద్ర క్యాబినెట్‌ ప్రకటించిన రూ.68,751 కోట్ల పునరుద్దరన ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 24న ఒక్కరోజు నిరాహార దీక్షను ఏయూఏబీ ఉద్యోగ సంఘాలు చేపట్టాయి. 

 

కాగా, కంపెనీని ఆదుకోవడానికి టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ గట్టిగానే కృషి చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. అలాగే, గత పది నెలలుగా కాంట్రాక్ట్‌ కార్మికులకు జీతాలు చెల్లించలేని స్థితికి బీఎస్‌ఎన్‌ఎల్‌ చేరుకున్నదని ఏయూఏబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇతర పోటీ టెలికం సంస్థలు 4జీ సేవలు ఆరంభించి దూకుడును ప్రదర్శిస్తుంటే ప్రభుత్వరంగ సంస్థయైన బీఎస్‌ఎన్‌ఎల్‌ వెనుకబడిపోతోందని తెలిపారు. ఈ ఏడాది కూడా 4జీ సేవలు అందించే అవకాశాలు లేవని తెలిపింది. ఇప్పటి వరకు కేంద్రం 4జీ స్పెక్ట్రం కేటాయించకపోవడం, మరోవైపు ఇతర టెలికం సంస్థలు ఏజీఆర్‌ బకాయిలతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందడం లేదని, ఈ విషయంలో కూడా ఆందోళనలు చేస్తామని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: