మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తాలూకు దెబ్బ  చంద్రబాబునాయుడు మీద గట్టి ప్రభావమే చూపుతున్నట్లుంది.  లేకపోతే బంపర్ మెజారిటితో వైసిపి  అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని, ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మళ్ళీ ప్రజా తీర్పు కోరాలని... ఇలా ఏవేవో అసంబద్ధమైన డిమాండ్లతో చంద్రబబు రెచ్చిపోయిన విషయం అందరూ చూసిందే. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెతలాగ లోకేష్ కూడా జగన్ ప్రభుత్వంపై జనాలందరూ అసంతృప్తిగా ఉన్నారంటూ పదే పదే ట్విట్టర్లో రెచ్చిపోతున్నారు.

 

ఇపుడు విషయం ఏమిటంటే తాజాగా చంద్రబాబు తన ట్విట్టర్లో ’ఇప్పటికప్పుడు ఎన్నికలు పెడితే డిపాజిట్లు కూడా రావంటూ వైసిపి వాళ్ళే ఆస్తులను పందేలుగా కడుతున్నారు’ అని చెప్పటమే విచిత్రంగా ఉంది. అదే సమయంలో ’ అభివృద్ధి చేసిన తెలుగుదేశంపార్టీని ఓటేయకపోవటం తమ తప్పిదమని’ నిన్ను గెలిపించినోళ్ళు అంటున్నారు అంటూ ట్వీట్ పెట్టి చంద్రబాబు తృప్తి పడిపోతున్నారు.

మాటకుముందు తాను 15 ఏళ్ళుగా సిఎంగా చేశానని, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నానని ఒకటే ఊదరగొడుతుంటారు. ఇక్కడే చంద్రబాబు ఓ విషయం మరచిపోయారు. ఎవరైనా తమ పార్టీ గెలుస్తుందనో లేకపోతే అభ్యర్ధో గెలుస్తాడని పందేలు కడతారు కానీ  ఓడిపోతాడని ఎవరూ పందేలు కట్టరన్న చిన్న లాజిక్ కూడా మరచిపోయారు. పైగా ఇంతోటి పనికిమాలిన పినికి ఆస్తులను కూడా పందేలుగా కడుతున్నారంటూ పనికిమాలిన ట్వీట్ పెట్టటమే ఆశ్చర్యంగా ఉంది.

 

అలాగే అభివృద్ధి చేసిన తెలుగుదేశంపార్టీకి ఓటేయకపోవటం తమ తప్పిదమని వైసిపికి ఓట్లేసిన వాళ్ళంటున్నారట. ఐదేళ్ళల్లో టిడిపి చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని పైగా అవినీతి ఆకాశమంతగా పెరిగిపోయిందనే జనాలు కసితో టిడిపిని ఓడగొట్టిన విషయాన్ని చంద్రబాబు ఒప్పుకోవటం లేదు.  చంద్రబాబు చేశానని చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా దేవతావస్త్రం లాంటిదే. వైసిపికి ఓట్లేసి తమ చెప్పుతో తాము కొట్టుకుంటున్నామంటూ ఆమధ్య రాజధాని గ్రామాల్లోకి కొందరితో చెప్పించి టిడిపి, చంద్రబాబు మీడియా తెగ  ప్రచారం చేసింది. నిజానికి అలా చెప్పిన వాళ్ళల్లో ఎంతమంది వైసిపికి ఓట్లేశారు ?  తొందరలోనే స్ధానిక సంస్ధల ఎన్నికలు వస్తున్నాయి కదా ? చూద్దాం జనాలు ఎవరికి ఓట్లేస్తారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: