ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుండి సమీకరించిన భూమిలో 1251 ఎకరాలను ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. నిన్న ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం 1251 ఎకరాల్లో 54,037 మందికి ఇళ్ల స్థలాలను "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు" పథకం కింద కేటాయించింది. 
 
ప్రభుత్వం పేదలకు కృష్ణా నదికి రెండో పక్కన ఉన్న విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలో స్థలాలను కేటాయించటంతో పాటు... తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని గ్రామాలలో కూడా స్థలాలను కేటాయిస్తోంది. పురపాక పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి జె శ్యామలారావు మాట్లాడుతూ సీ.ఆర్.డీ.ఏ చట్టంలోని 53(డి) నిబంధన భూసమీకరణలో తీసుకున్న భూమిలో 5 శాతం భూములను పేదలకు అందుబాటులో ఉంచాలని చెబుతోందని అన్నారు. 
 
ఈ నిబంధన ఆధారంగా ఉత్తర్వులను జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి నగర పరిధిలో భూసమీకరణ కోసం తీసుకున్న భూములలో 87.02 ఎకరాల్ని పేదలకు గృహ నిర్మాణం కోసం వినియోగించింది. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఒక్కో సెంటు స్థలం చొప్పున రాజధానిలోని మందడం, ఐనవోలు, కురగల్లు, కృష్ణాయపాలెం, నవులూరు గ్రామాల పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తోంది. 
 
ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాల్ని సీ.ఆర్.డీ.ఏ కమిషనర్ కు అందజేయాలి. కుటుంబంలోని మహిళల పేరు మీద ఒక సెంటు చొప్పున స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం పట్టా ఇస్తుంది. సీ.ఆర్.డీ.ఏ పేదలకు కేటాయించిన స్థలాలలో ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. గృహ నిర్మాణాలకు అవసరమైన నిధులను రెవెన్యూ శాఖ సమకూరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: