రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన కుటుంబ సభ్యులు, అమెరికాకు తిరుగు ప్రయాణం అయిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డెోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటనలో భాగంగా తన కుటుంబ సభ్యులతో భారత్ చేరుకున్నారు. ఇక్కడ ఆయన సబర్మతి ఆశ్రమం, తాజ్ మహల్ లాంటి గొప్ప ప్రదేశాలను చూసి సంతసించి పోయారు. ప్రధానితో అఫిషియల్ మీటింగ్స్ లో పాల్గొన్నారు.  భారత్, అమెరికాల సంత్సంబంధాల గురించి చర్చలు జరిపారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఇచ్చిన విందు పాల్గొన్నారు. 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత పర్యటన అద్భుతమన్నారు. ఈ రెండు రోజులు క్షణాల్లా గడిచిపోయాయని ఆయన అన్నారు. మీ ఆతిథ్యం మాకు ఎంతగానో నచ్చింది. అమెరికన్‌ ఫస్ట్‌ లేడి మెలానియా భారత్‌ను అమితంగా ఇష్టపడుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలాగే కొనసాగాలని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు మోది నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన టెక్సాస్‌కు వచ్చినపుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో తనతో గడిపారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ విందులో ట్రంప్‌కి ఎడమ వైపున ప్రధాని మోదీ కూర్చున్నారు. ట్రంప్‌కు ఎదురుగా వున్న వరుసలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా కూర్చున్నారు.

 

ట్రంప్‌తో కలిసి పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు విందు ఆరగించారు. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోది, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తదితర ప్రముఖులంతా వారికి వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ట్రంప్‌ కుటుంబ సభ్యులు కారులో నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో సిద్దంగా ఉన్న అమెరికా ప్రెసిడెంట్‌ అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌-1లో వారు ఇండియా నుంచి అమెరికాకు బయల్దేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: